A.Ganeshamoorthi: క్రిమిసంహారక మందు తాగి తమిళనాడు ఎంపీ ఆసుపత్రి పాలు
- ఈరోడ్ (తమిళనాడు) ఎంపీ, ఎమ్‌డీఎమ్‌కే నేత ఎ. గణేశమూర్తి ఆసుపత్రిలో చేరిక
- క్రిమిసంహారక మందు తాగినట్టు కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి తరలింపు
- ఎంపీ ఆరోగ్యం విషమంగా ఉందన్న ఎమ్‌డీఎమ్‌కే నేత దురై వైకో
- పార్టీ టికెట్ రాకపోవడంతో ఆత్మహత్యా యత్నం చేసిన మూర్తి
ఎమ్‌డీఎమ్‌కే పార్టీ నేత, ఈరోడ్ (తమిళనాడు) లోక్‌సభ ఎంపీ ఎ. గణేశమూర్తి ఆసుపత్రి పాలయ్యారు. క్రిమిసంహారక మందు తాగిన ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. క్రిమిసంహారక మందు తాగినట్టు ఆయన స్వయంగా కుటుంబసభ్యులకు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఆ తరువాత తీవ్ర అస్వస్థతకు లోనై, వాంతులు చేసుకున్న ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారని అన్నారు. అనంతరం, అక్కడి నుంచి కోయంబత్తూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పార్టీ తనకు ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆయన ఆవేదనతో ఆత్మహత్యా యత్నం చేసినట్టు చెబుతున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎ.గణేశమూర్తిని ఎమ్‌డీఎమ్‌కే నేత దురై వైకో పరామర్శించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు ఎక్మో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మంత్రి ఎస్, ముత్తుస్వామి, మొదకురచి బీజేపీ ఎమ్మెల్యే డా.సి.సరస్వతి, ఏఐఏడీఎమ్‌కేకు చెందిన కె.వి.రామలింగం కూడా ఆసుపత్రికి వెళ్లి గణేశమూర్తి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.