IPL 2024: బెంగ‌ళూరును రెచ్చ‌గొట్టేలా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ట్వీట్‌.. మండిప‌డుతున్న ఆర్‌సీబీ ఫ్యాన్స్‌!

LSG Shares Hilarious Social Media Post As They and RCB Sit in Bottom of IPL 2024 Points Table
  • ఈ సీజ‌న్‌ను ఓటమితోనే ప్రారంభించిన రెండు జ‌ట్లు
  • ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్‌సీబీకి తొమ్మిది, ఎల్ఎస్‌జీకి 10వ స్థానం
  • ఇదే  విష‌య‌మై సెటైరిక‌ల్ ట్వీట్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్
రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ను రెచ్చ‌గొట్టేలా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) చేసిన‌ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆదివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో ఓట‌మి పాలైంది. దాంతో ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో ఉంది. ఇక ఐపీఎల్‌-17 సీజ‌న్ ప్రారంభ మ్యాచులో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) చేతిలో ఆర్‌సీబీ ఓడిన విష‌యం తెలిసింది. దీంతో బెంగ‌ళూరు ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇలా పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్‌సీబీ తొమ్మిది, ఎల్ఎస్‌జీ 10వ స్థానంలో ఉండ‌టంపై "ఈ రాత్రి మా బెస్ట్ ఫ్రెండ్స్‌తో హాయిగా గ‌డిపాను" అని ల‌క్నో ట్వీట్ చేసింది. దీనికి పాయింట్ల ప‌ట్టిక క్లిప్పింగ్‌ను కూడా జోడించింది. 

ఈ సెటైరిక‌ల్ ట్వీట్‌పై బెంగ‌ళూరు ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. రెచ్చ‌గొట్ట‌డం మానుకోవాల‌ని చెబుతున్నారు. కాగా, గ‌తేడాది విరాట్ కోహ్లీ, గౌత‌మ్ గంభీర్ ఘ‌ర్ష‌ణ‌తో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్‌లోనూ ఆస‌క్తి నెల‌కొంటోంది. ఇక మ్యాచ్ రోజు ఇరు జ‌ట్ల అభిమానులు ఒక‌రిపై ఒక‌రు మాట‌ల యుద్ధానికి తెర‌లేపుతున్నారు. 

ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఆర్‌సీబీ, ఎల్ఎస్‌జీ రెండూ కూడా ఓట‌మితోనే సీజ‌న్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇంకా గ్రూపు ద‌శలో రెండు జ‌ట్లు చెరో 13 మ్యాచులు ఆడాల్సి ఉంది. అయితే, త‌మ త‌ర్వాతి మ్యాచుల‌ను ఈ రెండు టీమ్స్ పంజాబ్ కింగ్స్‌తోనే త‌ల‌ప‌డ‌నున్నాయి. నేటి (సోమ‌వారం) మ్యాచ్‌లో పంజాబ్‌ను బెంగ‌ళూరు ఢీకొన‌బోతోంది. అలాగే ఈ నెల 30న ల‌క్నో, పంజాబ్ మ‌ధ్య మ్యాచ్ ఉండ‌నుంది.
IPL 2024
LSG
RCB
Social Media
Twitter
Cricket
Sports News

More Telugu News