Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ మాదే... చైనా నోట ఇవాళ కూడా అదే మాట!
- అరుణాచల్ ప్రదేశ్ పై భారత్, చైనా మధ్య వివాదం
- అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ ఆక్రమించిందంటున్న చైనా
- అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని ఉద్ఘాటన
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని డ్రాగన్ దేశం ఎప్పటినుంచో మొండి వాదన చేస్తోంది. ఇప్పటికీ ఆ బాణీలో మార్పు లేకపోగా, ఇవాళ కూడా అదే మాట చెప్పింది. భారత్ ఆక్రమించకముందు అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగంలో కలిసి ఉండేదని జిన్ పింగ్ ప్రభుత్వం ఇవాళ ఓ ప్రకటన చేసింది.
అరుణాలప్రదేశ్ పై చైనా వాదనలు ఇప్పటికీ అసంబద్ధంగా, హాస్యాస్పదంగా ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ శనివారం నాడు వ్యాఖ్యానించారు. చైనా ఇలా చెబుతుండడం కొత్తేమీ కాదని అన్నారు.
ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ నేడు ఓ ప్రకటనలో స్పందించారు. భారత్, చైనా మధ్య సరిహద్దు ఇప్పటికీ స్థిరత్వాన్ని పొందలేకపోయిందని తెలిపారు. ఝాంగ్ నాన్ (అరుణాచల్ ప్రదేశ్ కు చైనా పెట్టుకున్న పేరు) లో చైనా గతంలో ప్రాబల్యం కలిగి ఉండేదని వివరించారు. ఝాంగ్ నాన్ ప్రాంతం చైనాదే అనడంలో ఎలాంటి వివాదాలకు తావులేదని లిన్ జియాన్ పేర్కొన్నారు.
అరుణాచల్ ప్రదేశ్ గా పిలుచుకుంటున్న ఆ ప్రాంతాన్ని భారత్ 1987లో ఏర్పాటు చేసిందని వెల్లడించారు. అయితే, భారత్ చర్యలను నిరసిస్తూ తాము స్పష్టమైన ప్రకటనలు చేశామని చెప్పారు. ఆక్రమించినంత మాత్రాన ఝాంగ్ నాన్ భారత్ సొంతం కాదని, చైనా వాస్తవ భౌగోళిక స్థితిలో ఎలాంటి మార్పు లేదని విషయాన్ని నొక్కి చెప్పామని లిన్ జియాన్ స్పష్టం చేశారు.