Saroja: పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ పై నిప్పులు చెరిగిన కాకినాడ మాజీ మేయర్ సరోజ
- నాదెండ్ల మనోహర్ జనసేనను సర్వనాశనం చేశాడని ఆగ్రహం
- పోల్ మేనేజ్ మెంట్ లేకపోవడం ఎవరి తప్పు? అంటూ పవన్ ను నిలదీసిన సరోజ
- ఒక తరం యువత భవిష్యత్తును నాశనం చేశారంటూ విమర్శలు
కాకినాడ మాజీ మేయర్, జనసేన నేత పి. సరోజ తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని సర్వనాశనం చేశారు. గతంలో కేబినెట్ హోదాలో ఉన్న వ్యక్తిగా, విధానపరమైన అంశాలు, పార్టీ నిర్మాణం తెలిసిన వ్యక్తిగా ఉండి ఈ రోజు జనసేన పార్టీని ఏం చేశారు?
మనకు పోల్ మేనేజ్ మెంట్ లేదని, బూత్ మేనేజ్ మెంట్ లేదని, టీడీపీకి పోల్ మేనేజ్ మెంట్ లో 40 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి వాళ్లకే అవకాశం ఇద్దాం, వాళ్లతో సమానంగా కలిసి అడుగులేద్దాం అని మొన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్ చెప్పారు. పోల్ మేనేజ్ మెంట్ లేకపోవడం అనేది ఇన్చార్జిల తప్పా?
నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి నెలకోసారి ఇక్కడికి వచ్చి క్లబ్ లో ఉంటూ, ఒక రోజుంతా మీటింగులు పెడుతుంటారు. మూడ్నాలుగు రోజులు ఇక్కడే ఉంటూ పోల్ మేనేజ్ మెంట్ కానీ, బూత్ మేనేజ్ మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు? ఈ అంశంపై నేను మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడు పవన్ కల్యాణే నేర్పారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనే ఇవాళ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను.
ఈ రోజు వరకు జనసేన పార్టీ ఏం చేస్తోంది? ఆయన దశాబ్దకాలంగా పార్టీని నడిపారు కదా... ఇప్పటిదాకా పోల్ మేనేజ్ మెంట్, బూత్ మేనేజ్ మెంట్ లేదంటే, ఇది ఎవరి వైఫల్యం? ఈ ప్రశ్నకు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పి తీరాలి.
ఇంతమంది జనసైనికులు ఉన్నారు, పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చిపోయే యువత ఉంది... పవన్ కల్యాణ్ కోసం చొక్కాలు చించుకుంటూ, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా కారు వెంట పరిగెడుతుంటూ ఆయనకు కొంచెం కూడా జాలి కలగడం లేదా? ఉన్నారు. వాళ్ల భవిష్యత్తును ఇవాళ సర్వనాశనం చేశారు. దశాబ్దకాలం అంటే... ఒక తరానికి భవిష్యత్తు పోయింది. మా నాయకుడు సీఎం అవుతాడు, సీఎం అవుతాడు అని ఒక తరం వారిని ఆయన వెంట తిప్పించుకున్నారు. మా నాయకుడు సీఎం అవ్వాలని కలలుగనే ఈ యువత ఏమైపోవాలి?
కలలు కనండి, కలలు కనండి అని వేదికపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ, యువత గురించి కొంచెమైనా ఆలోచించారా? యువతను గాలికి వదిలేశారు. జనసేన పార్టీ యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది.
నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి, కేకే... వీళ్లు పవన్ కల్యాణ్ వద్దకు ఎవరినీ రానివ్వరు, ఆయనను కలిసి ఏదైనా చెప్పే పరిస్థితి లేదు. ఆయన చుట్టూ ఒక కాపు కోటరీ ఉంటుంది. ఆ కోటరీ దాటి సామాన్యుడు వెళ్లలేని పరిస్థితి!
జనసేనలో చాలామందికి టికెట్లు దక్కలేదు, నాకు టికెట్ రాలేదన్న బాధ లేదు. కానీ, ఊరట కలిగించే ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు. అమ్మా... మీకు నేనున్నాను, దశాబ్ద కాలం వెయిట్ చేయండి, లేకపోతే రెండు దశాబ్దాలు వెయిట్ చేయండి... అని ఒక్క మాట కూడా చెప్పలేకపోయారు.
శ్రీకాళహస్తిలో కాపు వర్గానికి చెందిన వినూత్న అనే అమ్మాయి నాలుగు రోజులు ఏడిస్తే, ఆమెను పిలిచి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. నన్ను పిలవలేదు సరే... మరి నెల రోజుల నుంచి కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్న పితాని బాలకృష్ణ గారిని ఇప్పటిదాకా ఎందుకు పిలవలేదు?
శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవాళ్లం కాబట్టే మమ్మల్ని ఇంత చిన్నచూపు చూస్తున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు. మహిళలు కేవలం పనిచేయడానికే పనికొస్తారంతే" అంటూ సరోజ నిప్పులు చెరిగారు.