UNSC: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేయాలి.. ఐరాస భద్రతా మండలిలో తొలిసారి తీర్మానం

UN Security Council For The 1st Time Demands Immediate Gaza Ceasefire
  • రంజాన్ మాసం నేపథ్యంలో కాల్పుల విరమణ కోరిన భద్రతా మండలి
  • 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయడంతో ఆమోదం పొందిన తీర్మానం
  • ఓటింగ్‌కు దూరంగా ఉన్న మిత్రదేశం అమెరికా
ఉగ్రవాద సంస్థ ‘హమాస్‘ను అంతమొందించేందుకు గాజాలో దాదాపు 5 నెలలుగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధకాండను తక్షణమే ఆపివేయాలని ఐక్యరాజ్యసమితి కోరింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐరాస భద్రతా మండలి తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించిన అమెరికా తాజా తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉంది. రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పులను విరమించుకోవాలని కోరిన ఈ తీర్మానంపై సోమవారం ఓటింగ్ జరగగా.. భద్రతా మండలిలో అమెరికా మినహా మిగతా 14 సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.

స్లోవేనియా, స్విట్జర్లాండ్‌తో పాటు భద్రతా మండలిలోని అరబ్ దేశాల కూటమి అల్జీరియా ద్వారా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. శాశ్వత కాల్పుల విరమణకు మార్గం చూపడంతో పాటు అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన అమాయక బందీలను కూడా వదిలిపెట్టాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. కాల్పుల విరమణలో ‘శాశ్వత’ అనే పదాన్ని తొలగించడంపై రష్యా చివరి నిమిషంలో అభ్యంతరం తెలిపింది. వీటో కోరినప్పటికీ ఆమోదం పొందడంలో విఫలమైంది.

గతంలో తీర్మానాల ద్వారా హమాస్‌ను ఏమాత్రం ఖండించకుండా తాజాగా భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదింపజేయడాన్ని ఇజ్రాయెల్ విమర్శించింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏకంగా 1,160 మంది చనిపోయిన విషయం తెలిసిందే. 250 మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా కూడా మార్చుకున్నారు. నాటి నుంచి హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
UNSC
UNO
Gaza Ceasefire
Hamas
Israel
USA

More Telugu News