Sajjala Ramakrishna Reddy: మోదీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
- మోదీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్న సజ్జల
- ఎన్డీయేలో చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని వెల్లడి
- షర్మిలపై జగన్ కు ఒక అన్నగా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్య
- ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదన్న సజ్జల
- పవన్ పై వ్యక్తిగత కక్ష లేదని వ్యాఖ్య
ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి అత్యంత విధేయుడని చాలా మంది భావిస్తుంటారు. జగన్ ఎప్పుడడిగినా మోదీ వెంటనే అపాయింట్ మెంట్ ఇస్తుంటారు. మరోవైపు మోదీపై కానీ, కేంద్ర ప్రభుత్వంపై కానీ జగన్ ఒక్క విమర్శ కూడా చేయరు. అలాగే, ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన 'ప్రజాగళం' సభలో మోదీ కూడా జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. దీంతో, వీరిద్దరి మధ్య బలమైన సంబంధం ఉందనేది పలువురి భావన. ఇదే అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోదీతో జగన్ కు ఉన్నది కేవలం ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనని సజ్జల చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగానే ఇంతకాలం సంబంధం కొనసాగించారని తెలిపారు. ఎన్డీయేలో చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని... ఎన్డీయేతో కలవాలనుకుంటే ఎప్పుడో కలిసేవాళ్లమని అన్నారు. ఎవరితోనూ పొత్తు వద్దు అనుకున్నాం కాబట్టే ఎన్డీయేలో చేరలేదని చెప్పారు. నలుగురితో కలసి పోటీ చేస్తే తేడాలొస్తాయని అన్నారు. పొత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మోదీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారని... తాము అలా మాట్లాడలేమని చెప్పారు.
జగన్ కు, షర్మిలకు మధ్య ఉన్నవి కేవలం రాజకీయపరమైన విభేదాలు మాత్రమేనని సజ్జల అన్నారు. వైఎస్సార్ కుటుంబంలో గొడవలు లేవని చెప్పారు. షర్మిల రాజకీయంగా తప్పటడుగులు వేశారని చెప్పారు. షర్మిల పట్ల ఒక అన్నగా జగన్ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని అన్నారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూస్తే జాలి కలుగుతోందని సజ్జల అన్నారు. రాజకీయాలపై ఆయనకు క్లారిటీ లేదని చెప్పారు. ఎంతో చరిష్మా ఉన్న పవన్ కు రాజకీయ అవగాహన ఉంటే... పదేళ్లుగా ఇలాంటి రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. పవన్ పై తమకు వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదని చెప్పారు.