USA: ర‌ష్యాపై ఉగ్ర‌దాడిలో ఉక్రెయిన్ ప్ర‌మేయంపై అమెరికా క్లారిటీ

 White House press secretary Karine Jean Pierre Clarity on Mosco Terror Attack

  • మాస్కోలో న‌ర‌మేధానికి, ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అమెరికా స్పష్టీకరణ  
  • ఉక్రెయిన్‌కు ప్ర‌మేయం ఉంద‌న‌డానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవ‌న్న అగ్ర‌రాజ్యం
  • ఉగ్ర‌దాడికి పాల్ప‌డింది ఐసిస్ సంస్థేన‌ని పుతిన్ తెలుసుకున్నారన్న వైట్ హౌస్  

ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో ఈ నెల 22వ తేదీ రాత్రి ఉగ్ర‌వాదులు న‌ర‌మేధానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. క్రాక‌స్ సిటీ క‌న్స‌ర్ట్ హాల్‌లోకి ఆయుధాల‌తో ప్ర‌వేశించిన ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఈ దాడిలో 130 మందికి పైగా మృత్యువాత ప‌డ్డారు. తాజాగా మాస్కోలో జ‌రిగిన ఉగ్ర‌దాడితో ఉక్రెయిన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అమెరికా స్ప‌ష్టం చేసింది. అంతేగాక ఉక్రెయిన్‌కు ప్ర‌మేయం ఉంద‌న‌డానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవ‌ని వివ‌రించింది. 

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం శ్వేత‌సౌధం ప్రెస్ సెక్ర‌ట‌రీ క‌రీన్ జీన్ పియ‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. "ఉగ్ర‌దాడికి పాల్ప‌డింది ఐసిస్ సంస్థేన‌ని ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తెలుసుకున్నారు. ఈ విష‌యం ఆయ‌న‌కు స్ప‌ష్టంగా తెలుసు. ఈ దాడితో ఉక్రెయిన్ ప్ర‌భుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అందుకు త‌గిన ఆధారాలు కూడా లేవు" అని ఆమె తెలిపారు. 

మాస్కో న‌ర‌మేధాన్ని అమెరికా ఇప్ప‌టికీ ఖండిస్తూనే ఉంద‌ని ఈ సంద‌ర్భంగా సెక్ర‌ట‌రీ చెప్పారు. దీనికి పూర్తి బాధ్య‌త ఐసిస్‌దేన‌ని ఆమె వ్యాఖ్యానించారు. మార్చి 7వ తేదీనే రష్యాలోని అమెరికా పౌరుల‌కు దాడిపై అడ్వైజ‌రీ జారీ చేశామ‌ని గుర్తు చేశారు.  

ఇక ఈ దాడికి పాల్ప‌డింది తామేన‌ని ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ ప్ర‌టించిన విష‌యం తెలిసిందే. దీనిని అమెరికా సైతం ధ్రువీకరించింది. అయితే, ఈ ఉగ్ర‌దాడితో ఉక్రెయిన్‌కు సంబంధం ఉంద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఆరోపించారు. దాడి త‌ర్వాత నిందితులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న తెలిపారు. కాగా, పుతిన్ వ్యాఖ్య‌ల‌ను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు అమెరికా కూడా ఇదే విష‌య‌మై మ‌రోసారి క్లారిటీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News