Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్ నిరసనలు.. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్
- ఒకవైపు ఆప్ నిరసనలు.. మరోవైపు బీజేపీ ర్యాలీ
- మోదీ నివాసం ముందు ఆప్ శ్రేణుల నిరసన
- ఆప్ కార్యకర్తలు, నేతలు నిరసనలు చేయడానికి అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు
- ఫిరోజ్‌షా కోట్ల మైదానం నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వైపు బీజేపీ ర్యాలీ
- కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగిస్తాననటం సిగ్గుచేటంటూ బీజేపీ ధ్వజం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అంటూ ఆప్ నేతలు, కార్యకర్తలు మంగళవారం ఢిల్లీ వ్యాప్తంగా నిరసనకు దిగారు. మరోవైపు ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ కూడా చేపట్టాయి.
ఇక ఢిల్లీ సీఎం అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన ఆప్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడం జరుగుతోంది. ప్రధాని మోదీ ఇంటిని సైతం ముట్టడించేందుకు ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. కాగా, నిరసన తెలపడానికి అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు.
"ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నేతలు నిరసనలు చేయడానికి అనుమతి లేదు. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వద్దకు నిరసనకారులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని మాకు సమాచారం ఉంది. అందుకే మేము భద్రతా చర్యలు చేపట్టాము" అని ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేవేశ్ కుమారు తెలిపారు.
ఇక మోదీ నివాసం ముందు ఆప్ శ్రేణులు నిరసనకు దిగడంతో బీజేపీ కేజ్రీవాల్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించింది. ఫిరోజ్‌షా కోట్ల మైదానం నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వైపు బీజేపీ మెగా ర్యాలీ చేపట్టింది. జైలు నుంచి పాలన కొనసాగిస్తాననటం సిగ్గుచేటని కాషాయ పార్టీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.