USA: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించిన అమెరికా
- కేజ్రీవాల్ అరెస్ట్ నివేదికలను పరిశీలిస్తున్నామన్న యూఎస్ అధికార ప్రతినిధి
- విచారణ పారదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నామని వ్యాఖ్య
- ఇదే మాదిరి స్పందించిన జర్మనీపై ఇండియా ఆగ్రహం
ఢిల్లీ లిక్కర్ పాలసీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ప్రతిపక్ష నేత అరెస్ట్ కు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. విచారణ పారదర్శకంగా ఉంటుందని, సమయానుకూల న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
కేజ్రీవాల్ అరెస్ట్ పై జర్మనీ విదేశాంగ శాఖకు చెందిన ఒక అధికార ప్రతినిధి కూడా ఇదే మాదిరి స్పందించారు. కేజ్రీవాల్ న్యాయపరమైన, నిష్పక్షపాత విచారణకు అర్హులని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్మనీ స్పందనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఘాటుగా స్పందించింది. తమ న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను అవమానించడమేనని మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలను తమ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడంగా భావిస్తామని చెప్పింది. అంతేకాదు, ఈ అంశంపై జర్మనీ రాయబారికి సమన్లు జారీ చేసింది.