Chandrababu: హంద్రీనీవా కాలువపై సీఎం జగన్ నీళ్లు విడుదల చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు

Chandrababu visits  wherer CM Jagan released water on Handri Neeva Canal
  • గత నెల 26న హంద్రీనీవా నీళ్లు విడుదల చేసిన సీఎం జగన్
  • రాజుపేట వద్ద కాలువపై గేట్లు ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు
  • ఉత్తుత్తి గేట్ తో సినిమా సెట్టింగ్ ఏర్పాటు చేశారంటూ ఎద్దేవా
టీడీపీ చీఫ్ చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నేడు హంద్రీనీవా కాలువను పరిశీలించారు. ఫిబ్రవరి 26న సీఎం జగన్ హంద్రీనీవా కాలువపై నీళ్లు విడుదల చేసిన రాజుపేట ప్రాంతానికి చంద్రబాబు వెళ్లారు. సీఎం జగన్ ప్రారంభించిన కెనాల్ గేట్లను పరిశీలించారు. 

అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. హంద్రీనీవాలో ఉత్తుత్తి గేట్ తో సినిమా సెట్టింగ్ ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. నీటి విడుదల తంతు పూర్తి కాగానే గేట్ ను తీసేశారని ఆరోపించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు భూముల వ్యవహారంపై కూడా స్పందించారు. డీకేటీ భూములు, దేవస్థానం భూములు కొట్టేస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలను వేధిస్తున్నారని మండిపడ్డారు. బ్రిటీష్ హయాం నుంచి ఏపీలోని భూ రికార్డులు కచ్చితంగా ఉన్నాయని అన్నారు. 

పాస్ బుక్ లపై జగన్ ఫొటోలు ఎలా పెడతారని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. పన్నుల మొత్తాన్ని దుర్వినియోగం చేయడం నేరమని స్పష్టం చేశారు. కుప్పంలో తాను చేపట్టిన పనులు అందరికీ తెలుసని, కానీ గత ఐదేళ్లుగా కుప్పంలో గ్రానైట్, ఇసుక, భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. 

దేవాలయం భూములు కూడా కొట్టేయాలని చూస్తున్నారని, వైసీపీ నేతలు ఇప్పుడు ప్రైవేటు ఆస్తులపై పడ్డారని ధ్వజమెత్తారు.
Chandrababu
Handri Neeva
Jagan
Rajupeta
Kuppam
Chittoor District
TDP
YSRCP

More Telugu News