Sunita kejriwal: లిక్కర్ స్కాంపై కేజ్రీవాల్ కోర్టులోనే నిజాలు వెల్లడిస్తారు: భార్య సునీత

Delhi CM Kejriwal Will Reveal All Facts Regarding Delhi Liquor Policy Scam In Court says Sunita Kejriwal

  • గురువారం సాక్ష్యాధారాలతో వివరాలు వెల్లడి
  • సీఎం కేజ్రీవాల్ తనతో చెప్పారన్న సునీత
  • బుధవారం మీడియాకు వీడియో సందేశం విడుదల

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం పేరుతో కేంద్రం ఆడుతున్న నాటకానికి గురువారం కోర్టులోనే తెరదించుతానని కేజ్రీవాల్ తనకు చెప్పారని ఆయన భార్య సునీత వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలను, ఈ వ్యవహారానికి సంబంధించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందనేది దేశ ప్రజలకు కోర్టు ద్వారా వెల్లడిస్తారని వివరించారు. ఈమేరకు బుధవారం మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య, మాజీ ఐఆర్ఎస్ అధికారి సునీత కేజ్రీవాల్ తెలిపారు. రెండేళ్లుగా ఆప్ నేతల ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చాలాసార్లు దాడులు చేశారని, దాదాపు 250 సార్లకు పైగా తమ ఇళ్లల్లో సోదాలు చేశారని గుర్తుచేశారు. వందల కోట్ల స్కాం అని ఆరోపించిన అధికారులు ఇన్ని సోదాలు జరిపినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా గుర్తించలేదని గుర్తుచేశారు.

సీఎం కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం ద్వారా ఢిల్లీ ప్రజలను వేధించాలని చూస్తున్నారా? అంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దలను సునీత నిలదీశారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజలకు ఎలాంటి కష్టం కలగకూడదని కేజ్రీవాల్ భావిస్తున్నారు, తపన పడుతున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం నీటి సమస్యపై మంత్రి ఆతీశికి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సునీత గుర్తుచేశారు. మధుమేహంతో బాధపడుతున్నా, కస్టడీలో ఉన్నా సరే తన కష్టాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల కోసమే ఆలోచించే నేతను జైలుకు పంపించి ఏం సాధించాలని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారని చెప్పారు. అంతేకాదు, కేజ్రీవాల్ శరీరం మాత్రమే కస్టడీలో ఉందని, ఆయన ఆత్మ ఢిల్లీ ప్రజలకు తోడుగా వెన్నంటే ఉందని చెప్పారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News