Danam Nagender: కేసీఆర్ ను కొందరు తప్పుదోవ పట్టించారు: దానం నాగేందర్

Somebody who is with KCR misleaded him says Danam Nagender
  • కేసీఆర్ గొప్ప నాయకుడని దానం నాగేందర్ కితాబు
  • పక్కనున్న వాళ్లు ఆయనను భ్రష్టు పట్టించారని వ్యాఖ్య
  • లోక్ సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్ లో అడుగు పెడతానని ధీమా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గొప్ప నాయకుడని, కానీ పక్కనున్న వాళ్లు ఆయనను భ్రష్టు పట్టించారని అన్నారు. కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కేటీఆర్ కోర్టుకు వెళ్తే... తాను కోర్టులోనే సమాధానం చెపుతానని అన్నారు. 

గతంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్నారని... వారు చేసింది కరెక్ట్ అయితే... ఇప్పుడు తాను కాంగ్రెస్ లో చేరడం కూడా కరెక్టేనని దానం చెప్పారు. మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి రూ. 3,500 కోట్లు సంపాదించారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని... అదే నిజమైతే పదేళ్ల పాలనలో వాళ్లు ఎంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు. 

ఆస్తులను కాపాడుకోవడానికే తాను కాంగ్రెస్ లో చేరానని ఆరోపిస్తున్నారని... బీఆర్ఎస్ లో చేరిన తర్వాత తాను ఆస్తులు కూడబెట్టినట్టు వాళ్లు నిరూపిస్తే... తాను మొత్తం ఆస్తులను వదులుకుంటానని దానం అన్నారు. బీఆర్ఎస్ లో తాను ఒక కార్యకర్త మాదిరి పని చేశానని... ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఒక కార్యకర్త మాదిరే పని చేస్తూ ఎంపీ ఎన్నికలకు సిద్ధమయ్యానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో తాను గెలవడం ఖాయమని అన్నారు.
Danam Nagender
Revanth Reddy
Congress
KCR
BRS
TS Politics

More Telugu News