Chandrababu: జగన్ వెంట వైఎస్ ఘాట్ వద్దకు ఎవరు వచ్చారో చూశారా?: చంద్రబాబు
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
- పుత్తూరులో ఎన్నికల ప్రచార సభ
- బాబాయిని చంపిన వాళ్లను జగన్ వైఎస్ సమాధి వద్దకు తీసుకెళ్లాడన్న చంద్రబాబు
- జగన్ కు సిగ్గుంటే ఆ పని చేస్తాడా అంటూ ఫైర్
- జగన్ ప్రజల్లోకి వస్తే ఒక దోషిలా చూస్తారని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ప్రసంగించారు. తన ప్రసంగంలో సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఈ జగన్ మోహన్ రెడ్డి ఒక అబద్ధాల కోరు అని, బోగస్ సర్వేలు చేయిస్తాడని, అందరికీ డబ్బులిచ్చి మేనేజ్ చేయిస్తాడని అన్నారు. పేటీఎం కుక్కల్ని పెట్టుకుని మాపై దాడులు చేయిస్తుంటాడు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు, లేనది ఉన్నట్టు చెప్పడంలో దిట్ట అని పేర్కొన్నారు.
జగన్ కు సిగ్గుందా?
జగన్ కు సిగ్గుంటే, తన తండ్రి వైఎస్ సమాధి వద్దకు బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వాళ్లను తీసుకెళతాడా? అని ఘాటుగా విమర్శించారు. జగన్ తో పాటు ఇవాళ బస్సులో ఎవరున్నారు... అవినాశ్ రెడ్డి అని చంద్రబాబు వెల్లడించారు. అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నప్పటికీ అతడికి ఎంపీ టికెట్ ఇచ్చారు... ఎవరిపై అయినా ఆరోపణలు ఉంటే, అవి తేలాక టికెట్ ఇవ్వాలి కానీ, ఇలా మధ్యలోనే ఇస్తే ప్రజలను అవహేళన చేసినట్టే లెక్క అని చంద్రబాబు వివరించారు. బాబాయినే చంపిన వారికి మీరూ, నేనూ ఒక లెక్కా అని వ్యాఖ్యానించారు. మొన్నటివరకు కొన్ని సందేహాలు ఉండేవని, ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు చూశాక గెలుపు మనదే అని ధీమా కలుగుతోందని అన్నారు.
నువ్వు రాజకీయాలకు పనికి రావని చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
ముసుగు వీరుడు మొన్నటివరకు పరదాలు కట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు రోడ్డు మీదికి వచ్చాడు. జగన్ మోహన్ రెడ్డీ... ఇవాళ చెబుతున్నా... నీ యాత్రలకు ప్రజలు రారు. నిన్ను ఛీ కొడుతున్నారు. నువ్వు వచ్చినా నిన్ను ఒక దోషిలా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలకు పనికిరావని చెప్పే రోజు తొందర్లోనే ఉంది. నిన్నా మొన్నా ఒక కొత్త మాట మాట్లాడుతున్నాడు. ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారునంట. సేదలకు రూ.5కు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేసినవాడు పేదల మనిషి అవుతాడా? తమిళనాడులో అన్నా క్యాంటీన్లు, అమ్మ క్యాంటీన్లు ఉన్నాయా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్ రెడ్డీ... నేను పెట్టాను కాబట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశావు. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా. ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలో అన్నీ పెడతా.
జగన్ రెడ్డీ సిద్ధంగా ఉండు!
టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెడుతున్నాడు. దేశంలో ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో, వాళ్లందరి కంటే ఎక్కువ ఆస్తి ఉండే ముఖ్యమంత్రి ఈ జగన్ మోహన్ రెడ్డి. ఐదేళ్లలో ప్రజల ఆదాయం తగ్గింది కానీ, జగన్ ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన జలగ ఈ జగన్. ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా... మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాది. జగన్ రెడ్డీ సిద్ధంగా ఉండు... నిన్ను నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు వస్తుంది, నీ తాడేపల్లి ప్యాలెస్ ను ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు వస్తుంది... అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.