Danam Nagender: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: దానం నాగేందర్‌పై సొంత పార్టీ నేత తీవ్ర ఆగ్రహం

Congress leader raju yadav fires at danam nagendar

  • బలమైన నేత అనుకొని టిక్కెట్ ఇచ్చారు కానీ నా దృష్టిలో కాదన్న రాజు యాదవ్
  • పార్టీ మారి టిక్కెట్ దక్కించుకున్న దానం రేపు మళ్లీ పార్టీ మారడనే గ్యారెంటీ ఏమిటి? అని ప్రశ్న
  • దానంపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడి

కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి దానం నాగేందర్‌పై కాంగ్రెస్ నేత రాజుయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ టిక్కెట్ ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. బుధవారం రాజుయాదవ్ మీడియాతో మాట్లాడుతూ... దానం నాగేందర్ బలమైన నేత అనుకొని టిక్కెట్ ఇచ్చారని, కానీ తన దృష్టిలో ఆయన బలమైన నాయకుడేమీ కాదన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ టిక్కెట్ తీసుకున్నందున అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

పార్టీలు మారి వచ్చి టిక్కెట్ దక్కించుకున్న ఆయన... రేపు గెలిచాక మరోసారి పార్టీ మారడనే గ్యారెంటీ ఏమిటి? అని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చింది కాబట్టే తాము వ్యతిరేకించడం లేదన్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ముందు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన ఎలాంటి చర్య తీసుకోనందున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తేనే గెలుస్తాడన్నారు. తాను కోవర్టును కాదని నిరూపించుకోవాలంటే రాజీనామా చేయాలన్నారు.

  • Loading...

More Telugu News