SRH: టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్... విజయం కోసం తహతహలాడుతున్న సన్ రైజర్స్
- టోర్నీలో రెండో మ్యాచ్ ఆడుతున్న సన్ రైజర్స్
- తొలి మ్యాచ్ లో ఓటమి
- నేడు ముంబయిపై గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్న సన్ రైజర్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముంబయి ఇండియన్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ను సన్ రైజర్స్ సొంతగడ్డపై ఆడుతుండడం వారికి అదనపు బలాన్ని అందించనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్న నటరాజన్ స్థానంలో జయదేవ్ ఉనద్కట్ జట్టులోకి వచ్చాడు. ముంబయి జట్టులో ల్యూక్ స్థానంలో ఎంఫాక తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.
కాగా, ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో విజయానికి చేరువలోకి వచ్చిన సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ లో గెలుపు అత్యవసరం. వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడితే జట్టుపై, ముఖ్యంగా కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పై ఎంతో ఒత్తిడి నెలకొంటుంది. అందుకే, నేడు ముంబయి ఇండియన్స్ పై గెలుపు కోసం సన్ రైజర్స్ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డుతారనడంలో సందేహం లేదు.
అదే సమయంలో, ముంబయి జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జస్ప్రీత్ బుమ్రా వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
సన్ రైజర్స్ ఆడిన గత మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ విజృంభించిన తీరు అభిమానుల కళ్ల ముందు ఇంకా నిలిచే ఉంది. నేడు ముంబయిపైనా క్లాసెన్ అదే రీతిలో సిక్సర్ల వర్షం కురిపించాలని ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.