New Delhi: రాష్ట్రపతి పాలన విధిస్తే అది ప్రతీకార చర్య అవుతుంది: లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలకు ఢిల్లీ మంత్రి కౌంటర్
- ఢిల్లీలో జైలు నుంచి పరిపాలన ఉండదన్న లెఫ్టినెంట్ గవర్నర్
- దోషిగా తేలితేనే చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారన్న మంత్రి
- గవర్నర్ ఏ రాజ్యాంగ నిబంధనను ఉదహరిస్తున్నారని ప్రశ్న
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన జైలు నుంచి పరిపాలన చేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా... జైలు నుంచి పాలన ఉండదని వ్యాఖ్యానించారు.
దీంతో మంత్రి అతిషి పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఎవరైనా దోషిగా తేలితేనే అలాంటి చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించే విధంగా ప్రజాప్రాతినిధ్య చట్టం ఉందని గుర్తు చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగ నిబంధనను ఉదహరిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో చట్టం చాలా స్పష్టంగా ఉందన్నారు. అలాంటప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను ఎలా విధిస్తారు? అని ప్రశ్నించారు. పాలనకు అవకాశాలు లేని సందర్భంలోనే రాష్ట్రపతి పాలన విధించవచ్చునని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందన్నారు.
కానీ తమకు పూర్తి మెజార్టీ ఉన్న సమయంలోనూ రాష్ట్రపతి పాలన విధిస్తే ప్రతీకార చర్య అవుతుందని పేర్కొన్నారు. ఆర్టికల్ 356 అంశం సుప్రీంకోర్టుకు పలుమార్లు వెళ్లిందని... ఎన్నోసార్లు తీర్పులు వచ్చాయన్నారు. ఈరోజు రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ పగ అని స్పష్టంగా అర్థమవుతుంది' అని ఆమె వివరించారు. విపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇదో ఫార్ములా అని ఆరోపించారు.