Paripoornananda Swami: నాకు అందుకే టికెట్ రాలేదు.. చంద్రబాబుపై పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు
- హిందూపురం టికెట్ విషయంలో పునరాలోచన చేయాలన్న పరిపూర్ణానంద
- లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని హెచ్చరిక
- తనకు టికెట్ ఇస్తే ముస్లింలు దూరమవుతారని చంద్రబాబు చెప్పారన్న స్వామీజీ
- దక్షిణాదిలో హిందూపురం చాలా ముఖ్యమైన ప్రాంతమన్న పరిపూర్ణానంద
హిందూపురం నుంచి పోటీచేయాలని ఆశించి భంగపడిన పరిపూర్ణానందస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా హిందూపురం టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి పోటీచేయాలని భావించిన పరిపూర్ణానందకు ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆయన సంచనల వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో పునరాలోచన చేయకుంటే హిందూపురం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు.
పొత్తులకు ముందే చెప్పా
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడైన పరిపూర్ణానంద ఏడాది కాలంగా బీజేపీ తరపున ప్రచారం చేస్తూ హిందూపురంలో పోటీకి మార్గం సుగమం చేసుకున్నారు. ఇప్పుడేమో అధిష్ఠానం తనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను హిందూపురం నుంచి బరిలోకి దిగుతానని పొత్తులకు ముందే అధిష్ఠానానికి చెప్పానని గుర్తుచేశారు.
చంద్రబాబు హిందువులను బొందలో పెట్టారు
ఈ సందర్భంగా చంద్రబాబుపైనా పరిపూర్ణానంద విరుచుకుపడ్డారు. హిందూపురం సీటును స్వామీజీకి ఇస్తే ముస్లింలు దూరమవుతారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని, ముస్లింల కోసం హిందువులను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల కోసం 85 శాతం ఓటుబ్యాంకు ఉన్న హిందువులను బొందలో పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారని మండిపడ్డారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని పేర్కొన్నారు. దక్షిణాదిలో హిందూపురం చాలా ముఖ్యమైన ప్రాంతమని, పేరులోనే హిందూ ఉందని, అందుకనే ఇక్కడి నుంచి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.