IPL 2024: ఎస్ఆర్‌హెచ్ యజమాని కావ్యా మారన్ ఆనందానికి అవధుల్లేవుగా.. వీడియో వైరల్!
- ఐపీఎల్ 2024 లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం
- చెలరేగిన క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్.. ఆనందంతో ఎగిరి గంతులేసిన కావ్యా మారన్
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (277) నమోదు చేసిన ఎస్ఆర్‌హెచ్
- ఇంతకుముందు 2013 ఐపీఎల్ సీజన్‌లో పూణే వారియర్స్‌పై 263 పరుగులు చేసిన ఆర్‌సీబీ
- 11 ఏళ్ల తర్వాత అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన హైదరాబాద్
ఉప్పల్ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్ (ఎంఐ) తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తొలి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు 277 సాధించింది. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ 243 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సన్ రైజర్స్ 31 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు హేన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 పరుగులు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 60 పరుగులు), ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 64 పరుగులు) ఐడెన్ మార్క్రమ్ (28 బంతుల్లో 42 పరుగులు) ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ఇలా ఈ నలుగురు ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తున్న సమయంలో హైదరాబాద్ జట్టు యజమాని కావ్యా మారన్ స్టాండ్స్‌లో ఆనందంతో ఎగిరి గంతులేశారు. ఈ మ్యాచ్‌లో ఆమె నవ్వుతూ సంతోషంగా కనిపించారు. ఇక మ్యాచ్ కూడా గెలవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మ్యాచ్ సమయంలో ఆమె చేసిన హావభావాల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఐపీఎల్‌లో నిన్న ఎస్ఆర్‌హెచ్ అత్యధిక స్కోరు 277 సాధించి ఆర్‌సీబీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్ సీజన్‌లో పూణే వారియర్స్‌పై ఆర్‌సీబీ 263 పరుగులు చేసింది. 11 ఏళ్ల తర్వాత ఈ అత్యధిక పరుగుల రికార్డును ఆరెంజ్ ఆర్మీ బ్రేక్ చేసింది.