Revanth Reddy: నేను ఎక్కడ ఉన్నా ఓ కన్ను కొడంగల్ పైనే ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి
- తన ఇంటి వద్ద కార్యకర్తలు, అభిమానులతో సమావేశం
- కొడంగల్‌కు పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్న ముఖ్యమంత్రి
- తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొడంగల్ అండగా నిలిచిందని వ్యాఖ్య
తాను ఎక్కడ ఉన్నా ఓ కన్ను కొడంగల్ పైనే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇక్కడకి పరిశ్రమలను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని... అప్పుడు యువతకు ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొడంగల్ నుంచే 50వేల మెజార్టీ రావాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు సెలవులు వస్తాయి కాబట్టి ఇతర కార్యక్రమాలు పెట్టుకుంటారని, కానీ ఓటు చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలన్నారు. తనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చినట్లు చెప్పారు.
కార్యకర్తలను కలవాలని వచ్చానని చెప్పారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొడంగల్ ప్రజలు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. తాను ప్రచారానికి రాకపోయినప్పటికీ గెలిపించారన్నారు. ఇక్కడకు సిమెంట్ పరిశ్రమ రాబోతుందని... పరిశ్రమలు వస్తే మన భూముల ధరలు కూడా పెరుగుతాయన్నారు. ఏప్రిల్ 6న జరిగే తుక్కుగూడ కాంగ్రెస్ బహిరంగ సభకు కొడంగల్ నుంచి 25వేల మంది తరలి రావాలన్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని, దేశవ్యాప్తంగా ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తారన్నారు.