Daggubati Purandeswari: విశాఖ డ్రగ్స్ కేసుతో మా కుటుంబానికి సంబంధం లేదు: పురందేశ్వరి

Purandeswari responds to allegations in Visakha drugs case
  • విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ కలకలం
  • మీదంటే మీది అనుకుంటున్న అధికార, విపక్షాలు
  • పురందేశ్వరి కొడుకు, వియ్యంకుడి పేర్లు ప్రస్తావిస్తున్న వైసీపీ
  • అనవసర ఆరోపణలు చేయొద్దన్న పురందేశ్వరి 
ఇటీవల విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉండడం కలకలం రేపింది. అయితే, ఇది వైసీపీ నేతలకు చెందిన డ్రగ్స్ డీల్ అని టీడీపీ ఆరోపిస్తుండగా... బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి కొడుకు, వియ్యంకుడి ప్రస్తావన తీసుకువస్తూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. 

దీనిపై పురందేశ్వరి స్పందించారు. విశాఖ డ్రగ్స్ కేసుతో తన కుటుంబానికి సంబంధంలేదని ఆమె స్పష్టం చేశారు. తమ కుటుంబంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

పురందేశ్వరి ఇవాళ రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందేశ్వరి పైవిధంగా స్పందించారు. 

ఇక, రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరం అని నొక్కి చెప్పారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా విధ్వంసక, అరాచక పాలన చూస్తున్నామని, ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనఖా పెట్టిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పురందేశ్వరి పిలుపునిచ్చారు.
Daggubati Purandeswari
Visakha Drugs Case
BJP
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News