Nadendla Manohar: మీడియాలో వస్తున్న అవినీతి కథనాలపై ఏసీబీ స్పందించాలి: నాదెండ్ల మనోహర్
- ఏసీబీకి 8.03 లక్షల అవినీతి ఫిర్యాదులు అందాయన్న నాదెండ్ల
- ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్
- కూటమి అధికారంలోకి వచ్చాక అవినీతిపై చర్యలు తీసుకుంటామని వెల్లడి
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియాలో వస్తున్న అవినీతి అంశాలపై ఏసీబీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అన్నారు.
ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరు 14400కి 8.03 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. మంత్రులపైనా, వారి కార్యాలయాలపైనా 2.06 లక్షల అవినీతి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎమ్మెల్యేలపై 4.39 లక్షల ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈ ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
తమకు అందే ఫిర్యాదులపై ప్రతి ఏటా మీడియాకు చెప్పే ఏసీబీ... గత కొన్నేళ్లుగా బయటికి చెప్పడంలేదని ఆరోపించారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, ఎన్ని కేసులు నమోదయ్యాయో ఏసీబీ ఇప్పటికైనా వెల్లడించాలని స్పష్టం చేశారు.
ఏపీలో చోటుచేసుకుంటున్న అవినీతిపై అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక రూపొందిస్తే, ఆ నివేదికను బుట్టదాఖలు చేశారని నాదెండ్ల మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అవినీతి, కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు.