K Keshav Rao: నా తండ్రి ఈ వయస్సులో పార్టీ మారడం ఏమిటి? రేవంత్ రెడ్డి మా కుటుంబాన్ని విభజిస్తున్నారు: కేకేపై కొడుకు విప్లవ్ కుమార్
- పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారడం సరికాదన్న విప్లవ్ కుమార్
- తన తండ్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని తాను భావించడం లేదని వ్యాఖ్య
- మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారని వ్యాఖ్య
కే కేశవరావు పార్టీ మారడంపై ఆయన తనయుడు, బీఆర్ఎస్ నేత విప్లవ్ కుమార్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ వయస్సులో ఆయన పార్టీ మారడం ఏమిటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తండ్రి పార్టీని వీడటం బాధగా ఉందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సీనియర్ నాయకుడిగా తన తండ్రి కేసీఆర్‌కు అండగా ఉండాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం సరికాదన్నారు. అయితే, తన తండ్రి పదవుల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లుగా తాను భావించడం లేదన్నారు. ఈ వయస్సులో ఆయనకు పదవులు... పోస్టులు అవసరం లేదన్నారు.
కేకే తన జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన అవసరం పార్టీకి ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారినప్పుడు ఈ వయస్సులో పార్టీ మారడం ఏమిటి? అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని... ఇప్పుడు తన తండ్రిని ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు తమ కుటుంబం కలిసి ఉందని... కానీ రేవంత్ రెడ్డి వచ్చి విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ మార్పుపై తన తండ్రి పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.
పార్టీ మనకు ఇంత చేసినప్పుడు అదే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాలని సూచించారు. ఆత్మగౌరవం ఉంటే పార్టీ ఇచ్చిన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని తన తండ్రి కేకే, మేయర్ విజయలక్ష్మిలను డిమాండ్ చేశారు. దానం నాగేందర్ నమ్మదగిన వ్యక్తి కాదని, తాను చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తూనే ఉన్నానన్నారు. ఎప్పుడూ ఒక పార్టీలో ఉండరని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి కూదా ఆయన వెళ్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తనకు తండ్రి కంటే ఎక్కువ.. ఆయన కోసం ఏమైనా త్యాగం చేస్తానని చెప్పిన దానం నాగేందర్ ఇప్పుడు పార్టీ మారడం దారుణమన్నారు. పార్టీ వీడిన వాళ్లు పదవులకూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.