Hafiz Khan: హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ అవకాశం ఇచ్చిన సీఎం జగన్
- కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హఫీజ్ ఖాన్
- ఈసారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు టికెట్ ఇచ్చిన వైసీపీ
- హఫీజ్ ఖాన్ ను రాజ్యసభకు పంపిస్తామని నేడు ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ ప్రకటన
కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కించుకోలేకపోయారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కు కర్నూలు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తూ ఇటీవల వైసీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
అయితే, హఫీజ్ ఖాన్ కు సీఎం జగన్ మంచి ఆఫర్ ఇచ్చారు. హఫీజ్ ఖాన్ ను రాజ్యసభకు పంపిస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, హఫీజ్ ఖాన్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు.
"కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో హఫీజ్ ఖాన్ కు టికెట్ కేటాయించలేకపోయాం. రెండేళ్ల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా హఫీజ్ ఖాన్ రాజ్యసభకు పోటీ చేస్తారు" అని సీఎం జగన్ వివరించారు. రెండేళ్ల తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో కొందరి పదవీకాలం ముగుస్తుందని, హఫీజ్ ఖాన్ కు కచ్చితంగా టికెట్ ఇస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు.