Chandrababu: కావలి ఎమ్మెల్యే వంటి వింత జీవిని ఎక్కడా చూడలేదు: చంద్రబాబు
- నెల్లూరు జిల్లా కావలిలో చంద్రబాబు ప్రజాగళం సభ
- జగన్ ఇవాళ టీవీలు పగులగొట్టడం ఖాయమన్న చంద్రబాబు
- కావలి జనసముద్రాన్ని తలపిస్తోందని వెల్లడి
- కావలి స్థానాన్ని ఎన్నికల ముందే గెలిచామని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, పక్కనే ఉన్న సముద్రాన్ని మరిపించే జనసముద్రం ఇక్కడే ఉంది... అంటూ సభకు వచ్చిన జనాలను చూసి ఉత్సాహం ప్రదర్శించారు. కావలి సభ దద్దరిల్లింది... ఇది చూసిన సైకో జగన్ కి నిద్రరాదు... టీవీలు పగలగొడతాడు అని వ్యాఖ్యానించారు. చేసిన పాపాలు ఊరికే పోవు... వైసీపీని చిత్తు చిత్తు ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్డీయే అన్ స్టాపబుల్... వైసీపీకి డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది... యువత సభలకు భారీగా తరలివస్తున్నారు... మా పిల్లలకు భవిష్యత్ గ్యారెంటీ ఇవ్వమని ప్రజలు కోరుకుంటున్నారు... తప్పకుండా చేస్తాను అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఇవాళ టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావించారు.
"ఇవాళ మార్చి 29... తెలుగుజాతికి గుర్తింపు వచ్చిన రోజు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇచ్చిన రోజు, సంక్షేమం, సుపరిపాలన అందించిన రోజు. అదే తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన రోజు. ఎన్టీఆర్ స్వర్గంలో ఉన్నా ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. చరిత్రలో ఏదైనా చెప్పే ముందు ఏసు శకం కంటే ముందు, ఆ తర్వాత అని చెబుతుంటాం. రాష్ట్రంలోను తెలుగుదేశానికి ముందు, తరువాత అనే విధంగా రూపకల్పన చేశాం" అని వివరించారు.
కావలి కాలకేయుడు అవినీతిపరుడు
కావలి కాలకేయుడు అవినీతిపరుడు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడూ చూడలేదు. వింత జీవి, విచిత్రమైన మనిషి. అతనిని ఢీ కొట్టడానికి కావ్యా కృష్ణారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఈ సీటు మనదే... ఎన్నికలకు ముందే గెలిచాం. కావలి ఎమ్మెల్యే ఒక నాయకుడిగా కాదు మనిషిగా ఉండటానికి అర్హుడు కాదు.
కరుణాకర్ అనే దళిత వ్యక్తికి చెందిన చేపల చెరువును లాక్కున్నారు. కప్పరాల తిప్పలో బీసీ గురుకుల కింద ఉన్న 4 ఎకరాల భూమిని కబ్జా చేశారు. సెంటు పట్టా భూమిలో రూ.100 కోట్లు కొట్టేశారు. కావలి రూరల్ లో విచ్చల విడిగా గ్రానైట్ దోచుకున్నారు. ప్రతి దానిలో కమీషన్లు కావాలంటూ గద్దల్లా మారి పీక్కుతుంటున్నారు. మీ అరాచకాలను చిత్రగుప్తుడి మాదిరి లెక్కలు రాశాను. ఈసారి మాత్రం వడ్డీతో సహా చెల్లిస్తాను.
దగదర్తి పూర్తి చేస్తాను
ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు నేను కడితే జగన్ రెడ్డి రిబ్బన్ కట్ చేశారు. 18 నెలల్లో దగదర్తి విమానాశ్రయానికి ఫౌండేషన్ వేశాను. ఎయిర్ పోర్టు పూర్తి చేస్తాను. కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పూర్తి చేస్తాం.
గతంలో మత్స్య కారులకు ఇచ్చిన పథకాల కంటే మెరుగైన పథకాలు అందిస్తాం. మత్స్య కారులకు శాపంగా మారిన 217 జీవోను రద్దు చేస్తాం. గతంలో ఇచ్చిన పథకాలన్నీ మళ్లీ పునరుద్దరిస్తాం. ఆక్వా పరిశ్రమలకు చేయూతనిస్తాం. రూ.1.50 విద్యుత్ సరఫరా చేస్తాం. ఉప్పు నిల్వ చేయడానికి షెడ్లు నిల్వ చేస్తాం. నార్త్ అమ్మలోరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఈ ప్రభుత్వం రద్దు చేసింది... మేము దానిని పూర్తి చేస్తాం.
మాకు ఓటు వేస్తే కంపెనీలు వస్తాయి, మీ పొలాలకు నీళ్లు వస్తాయి, రోడ్లు వస్తాయి, ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తాం, మహిళలకు రక్షణ ఇస్తాం, కరెంట్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేస్తాం. నాసిరకం మద్యంతో మీ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్న జగన్ రెడ్డిని ఇంటికి పంపాలి... అంటూ చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొన్నారు.