Indian Navy: సముద్రపు దొంగల దాడి.. పాకిస్థానీలను కాపాడిన భారత నేవీ

Indian Navy Rescues 23 Pak Nationals From Iranian Fishing Vessel Attacked By Pirates

  • మార్చి 28న సోకోట్రా తీరానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో చేపల బోటుపై దాడి
  • బోటులో చిక్కుకున్న 23 మంది పాకిస్థానీ సిబ్బంది
  • దాడి సమాచారం అందగానే రంగంలోకి భారత యుద్ధ నౌకలు
  • 12 గంటల పాటు శ్రమించి దొంగల అరెస్టు

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడి నుంచి 23 మంది పాకిస్థానీలను భారత నేవీ రక్షించింది. మార్చి 28న ఇరాన్‌కు చెందిన ఓ చేపల బోటుపై సముద్రపు దొంగలు దాడి చేశారని తెలియడంతో రంగంలోకి దిగిన భారత నేవీ 12 గంటల పాటు శ్రమించి దొంగలను అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘‘దాడి గురించి తెలియగానే రెండు యుద్ధ నౌకలను అక్కడికి పంపించాం. 12 గంటల పాటు శ్రమించి నావపై ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నాం’’ అని నేవీ పేర్కొంది. పడవలోని 23 మంది పాకిస్థానీ సిబ్బందిని రక్షించినట్టు వెల్లడించింది. అనంతరం, నావను క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలిపెట్టామని పేర్కొంది. సోకోట్రా తీరానికి నైరుతి దిక్కున 90 నాటికల్ మైళ్ల దూరంలో దొంగలు ఆ నావపై దాడి చేసినట్టు వెల్లడించింది. 

నేవీ ప్రకటన ప్రకారం, తమను రక్షించాలంటూ సిబ్బంది అభ్యర్థించగానే భారత నేవీ రంగంలోకి దిగింది. తొలుత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమేధ.. దొంగలు హైజాక్ చేసిన నావను అడ్డగించింది. ఆ తరువాత.. సుమేధకు తోడుగా ఐఎన్ఎస్ త్రిశూల్‌ కూడా రంగంలోకి దిగింది. సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం దొంగలను అదుపులోకి తీసుకుంది. 

ఈ నెల మొదట్లో భారత నేవీ మరో నౌకను సముద్రపు దొంగల దాడి నుంచి రక్షించింది. భారత తీరానికి సుమారు 2600 కిలోమీటర్ల దూరంలో పైరేట్లు రూయెన్ అనే నౌకపై దాడి చేశారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక రంగంలోకి దిగి పైరేట్లను తరిమికొట్టింది. ఈ ఘటనలో 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోయారు. రూయెన్‌లోని 17 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

  • Loading...

More Telugu News