Joe Biden: నేను విమానం తలుపు పక్కన కూర్చోనుగా.. బోయింగ్ విమానాల్లో నాణ్యతా లోపాలపై జో బైడెన్ జోక్
- బోయింగ్ విమానాల్లో ఇటీవల బయటపడుతున్న నాణ్యతా లోపాలు
- విమానం 16 వేల ఎత్తున ఉండగా విరిగిపడిన విమానం తలుపు
- మీ విమానం తలుపులు సరిగా బిగించారా? అన్న వ్యాఖ్యాత ప్రశ్నకు బైడెన్ సరదా సమాధానం
- ఆ వెంటనే సర్దుకుని ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదన్న అమెరికా అధ్యక్షుడు
తాను విమానం తలుపుల వద్ద కూర్చోనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చమత్కరించారు. కొన్ని నెలల క్రితం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తుండగా విమానం తలుపు ఊడి కిందపడింది. ఆ సమయంలో విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. అందులో 171 మంది ప్రయాణికులు ఉన్నారు. పడిపోయిన డోర్ పక్కనే ప్రయాణికులు ఉన్నప్పటికీ పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటన తర్వాత విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకంటే ముందు కూడా బోయింగ్ విమానాల్లో భద్రతా పరమైన లోపాలు వెలుగుచూశాయి. దీంతో ఆందోళన వ్యక్తమైంది. అయితే, ఆ తర్వాత బోయింగ్ సంస్థ విమానాల్లో భద్రతా పరమైన చర్యలు చేపట్టింది. మరమ్మతులు చేసింది.
తాజాగా బైడెన్ ఓ టాక్ షోలో పాల్గొన్నారు. వ్యాఖ్యాత మాట్లాడుతూ.. మీరు న్యూయార్క్ వెళ్లేముందు మీ రవాణాశాఖ మంత్రి ఎయిర్‌ఫోర్స్ వన్ (అధ్యక్షుడు ప్రయాణించే విమానం) బోల్టులు సరిగా బిగించారా? అని ప్రశ్నించారు. దానికి బైడెన్.. తాను తలుపు వద్ద కూర్చోనని బదులిచ్చారు. ఆ వెంటనే సర్దుకుని తాను సరదాగా ఈ మాట అన్నానని, అయితే, ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదని పేర్కొన్నారు.