Ponnam Prabhakar: ఒక్కసారి టచ్ చేసి చూడు: మహేశ్వర్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ కౌంటర్
- మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మహేశ్వర్ రెడ్డికి హెచ్చరిక
- బీఆర్ఎస్‌లో బీసీ ఎప్పుడైనా అధ్యక్షుడు అయ్యారా? అని ప్రశ్న
- కనీసం కేసీఆర్ సీఎం అయినప్పుడైనా అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందని వ్యాఖ్య
'మా ప్రభుత్వాన్ని ఒక్కసారి టచ్ చేసి చూడు' అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హెచ్చరించారు. గాంధీభవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు పాడిందే పాట అన్న సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. ఆయనేమీ జ్యోతిష్యం చదవలేదన్నారు. అంతకుముందు, బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 48 గంటల్లో కూలిపోతుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్‌పై పొన్నం ఆగ్రహం
బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తోందన్నారు. అదే బీసీల గురించి బీఆర్ఎస్‌లో అడిగే పరిస్థితి ఉందా? అని నిలదీశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ తప్ప ఎవరైనా అధ్యక్షుడిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. పార్టీ అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా... ఫ్లోర్ లీడర్, అధ్యక్ష పదవి అన్నీ వారికేనని విమర్శించారు. కనీసం కేసీఆర్ సీఎం అయినప్పుడు అయినా బీసీకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి ఉండవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పుడైనా ఎన్నికలకు ముందు బీసీలకు మీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచించారు. కేటీఆర్‌కు చాలా తెలుసనుకున్నానని.. కానీ ఏమీ తెలియదన్నారు.