Lanka Dinakar: జగన్ ఇప్పుడు అయోమయం జగన్నాథంలా కనిపిస్తున్నాడు: లంకా దినకర్

BJP leader Lanka Dinakar take a swipe at CM Jagan

  • జగన్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు బయల్దేరాడన్న దినకర్
  • విశ్వాసఘాతుకానికి జగన్ ట్రేడ్ మార్కు లాంటి వాడని విమర్శలు
  • ఏపీని గట్టెక్కించాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిందేనని ఉద్ఘాటన 

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర నేత లంకా దినకర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా అరాచక పాలన సాగుతోందని, ఈ పరిస్థితుల్లో ఏపీని గట్టెక్కించాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టం చేశారు. 

జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చూస్తుంటే, మరోసారి ప్రజలను మోసం చేయడానికి వచ్చినట్టుందని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని అన్నారు. పదే పదే విశ్వసనీయత, విశ్వాసం అనే పదాలను ఆయన వాడుతున్నారని, గడచిన ఐదేళ్లలో ఆయన పాలన తీరు గానీ, ఆ వ్యవహార శైలి గానీ గమనిస్తే... విశ్వాస ఘాతుకానికి ట్రేడ్ మార్కు జగన్ మోహన్ రెడ్డి అనే విషయం స్పష్టమవుతుందని లంకా దినకర్ వ్యాఖ్యానించారు. 

"నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడి కలబోతే జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పాలన ఆ విధంగా సాగుతోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయిక త్రిమూర్తుల కలయిక వంటిది. తద్వారా రాష్ట్రంలో రాక్షస సంహారం తథ్యం. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ ఈ ఐదేళ్ల తర్వాత చూస్తే అయోమయం జగన్నాథంలా  కనిపిస్తున్నారు. 

2019లో తమ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్... ఆ తర్వాత ప్రజలకు బిస్కెట్లు వేస్తూ, తాను మాత్రం ఇంట్లో బంగారు బిస్కెట్లు పోగేసుకుంటున్నాడు. ఇవాళ కేంద్రం ఇచ్చిన నిధులకు, పథకాలకు పేర్లు మార్చి స్టిక్కర్లు తగిలించుకుంటున్నాడు. 

అభివృద్ధి వికేంద్రీకరణ చేసేశామని, మూడు రాజధానులు ఇచ్చేశామని కూడా ఆయన చెప్పుకుంటున్నారు. నిజమే, ఆయన మూడు రాజధానులు ఇచ్చేశాడని నేను నమ్ముతున్నాను. ఒకటి మద్యం రాజధాని, రెండు గంజాయి రాజధాని, మూడు డ్రగ్స్ రాజధాని. రాష్ట్రంలో ఈ మూడు రాజధానులు విలసిల్లుతున్న మాట వాస్తవమే!

ఈ అరాచక, అభివృద్ధి రహిత, విధ్వంసకర పాలనకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడడం తథ్యం. ఇక జగన్ మోహర్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకుని, ఏ ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, ఆ ప్యాలెస్ దిశగా దారి చూసుకోవడం మంచిది" అంటూ లంకా దినకర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News