Himanta Sarma On UCC: రెండో పెళ్లి ఆలోచన ఉంటే ఇప్పుడే చేసుకో.. ఎన్నికలయ్యాక చేసుకుంటే జైలుకు పంపిస్తా..!: అస్సాం సీఎం

Marry Again Now If You Want Himanta Sarma To AIUDF Chief
  • ‘యూసీసీ’ ని ప్రస్తావిస్తూ ధుబ్రి ఎంపీ అజ్మల్ కు హిమంత బిశ్వ శర్మ వార్నింగ్
  • తనకు వయసు పైబడిందన్న వ్యాఖ్యలకు అజ్మల్ కౌంటర్
  • ఇప్పుడు కూడా మరో పెళ్లి చేసుకునేంత శక్తి తనకుందని కామెంట్
లోక్ సభ ఎన్నికలయ్యాక అస్సాంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసి తీరతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి స్పష్టం చేశారు. ఏఐయూడీఎప్ పార్టీ చీఫ్, ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ కు కౌంటర్ ఇస్తూ యూసీసీ అమలు విషయాన్ని ప్రస్తావించారు. ఎంపీ అజ్మల్ కు మరో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఎన్నికల ముందే చేసుకోవాలని, ఆ తర్వాత చేసుకుంటే మాత్రం జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. భార్య లేక భర్త బతికుండగానే మరో పెళ్ళి చేసుకోవడం యూసీసీ ప్రకారం నేరం, దీనికి జైలు శిక్ష తప్పదని తేల్చి చెప్పారు.

అసలేం జరిగిందంటే..
ధుబ్రి ఎంపీ అజ్మల్ మరోసారి అక్కడి నుంచే లోక్ సభ బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ తనపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. రకీబుల్ తనకు వయసైపోయిందని అంటున్నాడని చెబుతూ.. ఈ వయసులోనూ మరో పెళ్లి చేసుకునేంత శక్తి సామర్థ్యం తనకుందని అజ్మల్ చెప్పారు. నేనలా చేయడం ముఖ్యమంత్రి హిమంత శర్మకు ఇష్టం లేకపోయినా సరే, పెళ్లి చేసుకుని తీరతానని వివరించారు.

ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి హిమంత శనివారం స్పందించారు. ‘అజ్మల్ ఇప్పుడు రెండో పెళ్లి మాత్రమే కాదు.. మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా మాకు అభ్యంతరంలేదు. పిలిస్తే పెళ్లికి వెళతాం కూడా.. ఎందుకంటే ఇప్పుడు అది ఇల్లీగల్ కాదు. కానీ ఎన్నికలయ్యాక యూసీసీ అమలులోకి వస్తుంది. అప్పుడు రెండో పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ పెళ్లిని ఆపేస్తాం, అంతేకాదు ఆయనను జైలుకు పంపిస్తాం’ అని హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు.
Himanta Sarma On UCC
polygamy
Assam CM
AIUDF Chief
Lok Sabha Polls
BJP

More Telugu News