Sajjala Ramakrishna Reddy: తాము వస్తే వాలంటీర్ తరహా వ్యవస్థలేవీ ఉండని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు: సజ్జల

Sajjala slams Chandrababu over Volunteers issue
  • ఏపీలో వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయరాదన్న ఈసీ
  • ఇది చంద్రబాబు పనే అంటూ సజ్జల ఫైర్
  • వాలంటీర్లపై కక్షగట్టారని ఆగ్రహం 
  • నేరుగా జోక్యం చేసుకోకుండా నిమ్మగడ్డ ద్వారా పోరాటం చేయిస్తున్నాడని ఆరోపణ
  • సచివాలయం ద్వారా పెన్షన్లు అందిస్తామని వెల్లడి
వాలంటీర్ల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు పూటకోమాట మార్చుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణి చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. దీనిపై సజ్జల స్పందించారు. 

పేదలకు మేలు చేసే వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, అందుకే తాము నేరుగా జోక్యం చేసుకోకుండా సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థ ద్వారా పోరాటం చేయిస్తున్నారని మండిపడ్డారు.

సిటిజన్స్ ఫర్ డెమొక్రసీలో ఉండే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన విశ్వరూపం ప్రదర్శించారని, ఆయన టీడీపీ కార్యాలయం నుంచే ఆజ్ఞలు జారీ చేస్తున్నారా అనేంతగా మమేకం అయ్యారని ఆరోపించారు. పూర్తిస్థాయి టీడీపీ కార్యకర్తలా వ్యవహరించే నిమ్మగడ్డ, మరో ఇద్దరు ముగ్గురు కలిసి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ స్థాపించారని సజ్జల వివరించారు. 

వీళ్లు వాలంటీర్ వ్యవస్థపై సుప్రీంకోర్టును ఆశ్రయించారని, కానీ కోట్లలో ఫీజులు వసూలు చేసే కపిల్ సిబాల్ వంటి న్యాయవాదిని రిటైరైన ఐఏఎస్ అధికారులు, రిటైరైన జడ్జిలు ఈ కేసుకు నియమించుకోవడం చూస్తుంటే దీని వెనుక ఎవరున్నారో తెలుస్తుందని అన్నారు. వీళ్లకు ఇప్పటికిప్పుడు ప్రజాస్వామ్యంపై ప్రేమ పుట్టుకొచ్చిందని, వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడమే వీరి లక్ష్యమని సజ్జల ధ్వజమెత్తారు.

సచివాలయం ద్వారా పెన్షన్లు అందిస్తాం

ఏపీలో పింఛనుదారులు ఆందోళనకు గురికావొద్దు. గ్రామగ్రామాన ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందిస్తాం. ఏప్రిల్ 3వ తేదీన పెన్షన్లు అందిస్తాం. లబ్ధిదారులు తమ ప్రాంతంలోని సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకోవాలి. చంద్రబాబు వంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి. మామూలు సర్టిఫికెట్ కావాలన్నా రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉంటుంది. 

కానీ వాలంటీర్ల వల్ల ప్రజలకు ఎంతో వెసులుబాటు కలుగుతోంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండేలా చేస్తోంది వాలంటీర్లే. వాలంటీర్ల సేవలు ఆపేయాలని, సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది చంద్రబాబే. వాలంటీర్లను ఎందుకు వద్దంటున్నారు, సచివాలయ సిబ్బందిని ఎందుకు కావాలంటున్నారు? సచివాలయ సిబ్బంది కూడా జగనే నియమించారు కదా! తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్థలేవీ ఉండవనే చంద్రబాబు తన చర్యల ద్వారా సందేశం ఇచ్చారు.

పవన్ విషయంలో మేం చెప్పిందే జరిగింది

పవన్ కల్యాణ్ ను చంద్రబాబు మింగేస్తాడని మేం చెప్పాం. ఇప్పుడదే జరిగింది. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇచ్చాడు? ఆ ఇచ్చిన సీట్లలో కూడా చంద్రబాబు మనుషులే కనిపిస్తున్నారు. పిఠాపురంలో పవన్ ఇష్టం లేకుండానే పోటీ చేస్తున్నారు. ఎవరో పంపితే ఆయన పిఠాపురం వెళ్లాల్సి వచ్చింది. ఒకప్పుడు సీఎం సీఎం అనిపించుకున్న పవన్ ఇప్పుడు 21 సీట్లకు పరిమితం అయ్యారంటే కారణం ఎవరు? బీజేపీ పరిస్థితి కూడా అందుకు మినహాయింపు కాదు అన్నారు.
Sajjala Ramakrishna Reddy
Chandrababu
Volunteers
YSRCP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News