MS Dhoni: విశాఖ గడ్డపై ధోనీ సరికొత్త రికార్డు.. టీ20 క్రికెట్‌‌లో ఆ ఘనత అతడిదే!

MS Dhoni scripts another record in T20 cricket history
  • టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మందిని వెనక్కి పంపిన కీపర్‌గా ధోనీ రికార్డు
  • ఇప్పటి వరకు 300 మందిని వెనక్కి పంపిన చెన్నై కీపర్
  • అత్యధిక సిక్సర్ల రికార్డులో కోహ్లీని వెనక్కి నెట్టేసిన చెన్నై మాజీ సారథి
టీ20 క్రికెట్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు ధోనీ సరికొత్త రికార్డు సృష్టించాడు. విశాఖపట్టణంలో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీషా క్యాచ్ అందుకున్న ధోనీ.. టీ20 క్రికెట్‌లో 300 మందిని వెనక్కి పంపిన తొలి వికెట్ కీపర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఆర్సీబీ కీపర్ దినేశ్ కార్తీక్, లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ వంటి వారిని వెనక్కి నెట్టేశాడు. టీ20 క్రికెట్‌లో ధోనీ ఇప్పటి వరకు 300 మందిని అవుట్ చేసి వెనక్కి పంపగా, అందులో 213 క్యాచ్‌లు ఉన్నాయి.

ధోనీ తర్వాతి స్థానంలో దినేశ్ కార్తీక్ 276 (207 క్యాచ్‌లు), కమ్రాన్ అక్మల్ 274 (172 క్యాచ్‌లు), క్వింటన్ డీకాక్ 269 (220 క్యాచ్‌లు), జోస్ బట్లర్ 208 ( 167 క్యాచ్‌లు) టాప్-5లో ఉన్నారు. ఇక, 42 ఏళ్ల ధోనీ గత రాత్రి ఢిల్లీతో మ్యాచ్‌లో బ్యాట్ ఝళిపించాడు. జట్టు విజయానికి 23 బంతుల్లో 72 పరుగులు అవసరమైన వేళ 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (241)ని అధిగమించాడు. 

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదింది వీరే
క్రిస్ గేల్ 141 ఇన్నింగ్స్‌లలో 357 సిక్సర్లు
రోహిత్‌శర్మ 240 ఇన్నింగ్స్‌లలో 261 సిక్సర్లు
ఏబీ డివిలియర్స్ 170 ఇన్నింగ్స్‌లలో 251 సిక్సర్లు
ఎంఎస్ ధోనీ 219 ఇన్నింగ్స్‌లలో 242 సిక్సర్లు
విరాట్ కోహ్లీ 232 ఇన్సింగ్స్‌లలో 241 సిక్సర్లు
డేవిడ్ వార్నర్ 179 ఇన్నింగ్స్‌లలో 234 సిక్సర్లు
MS Dhoni
IPL 2024
Visakhapatnam
CSK
DC
Virat Kohli

More Telugu News