US Envoy: భారత విద్యార్థులపై దాడులు.. అమెరికా రాయబారి కీలక సూచన
- అమెరికా లాంటి పెద్ద దేశంలో ఒక్కోసారి ఇలా జరుగుతుందన్న రాయబారి ఎరిక్ గార్సెటీ
- విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచన
- ఒంటరిగా కాకుండా బృందాలుగా పర్యటించాలని సూచన
- క్యాంపస్ లో అందుబాటులో ఉన్న వనరులు వినియోగించుకోవాలన్న గార్సెటీ
అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలాంటి పెద్ద దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తాజాగా ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో నేను మాట్లాడాను. వారి పరిస్థితికి నా హృదయం ద్రవించింది. నిందితులకు శిక్ష పడేలా చేస్తాము. ఇలాంటి విషయాలను మేము సీరియస్‌గా తీసుకుంటాం’’ అని ఆయన అన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపిన ఆయన బాధితులకు న్యాయం లభించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
దాడుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తమ మిత్రులు, ఇతర విద్యార్థులతో నిత్యం టచ్‌లో ఉండాలని, భద్రతాపరంగా చేపట్టాల్సిన చర్యలపై అవగాహన, సంసిద్ధత పెంచుకోవాలని సూచించారు. ఈ దిశగా యూనివర్సిటీల్లోని వనరులను వినియోగించుకోవాలని చెప్పారు. విద్యార్థులు బృందాలుగా పర్యటించాలని అన్నారు. రిస్కీ బిహేవియర్‌తో ఉండటం, డ్రగ్స్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించారు. విదేశాల్లో పర్యటించే అమెరికన్లకూ తాము ఇవే సూచనలు చేస్తామని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు తక్కువగా జరగడంపై కూడా గార్సెటీ స్పందించారు. అమెరికాలో కొన్ని సవాళ్లు ఉన్న మాట వాస్తవమే అయినా గతంలో కంటే పరిస్థితి బాగా మెరుగుపడిందని చెప్పారు. భద్రతా పరంగా భారతీయులకు అమెరికా అనువైన దేశమన్న ఆయన తమ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు అమిత ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు.