Miami Open Title: ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించిన భారత్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న
- మియామి ఓపెన్ డబుల్స్ టైటిల్ బోపన్న జోడీదే
- 44 ఏళ్ల వయసులో ‘ఏటీపీ మాస్టర్స్ 1000’ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా బోపన్న కొత్త చరిత్ర
- బోపన్నకు ఇది 14వ ఏటీపీ మాస్టర్స్ ఫైనల్ కాగా.. ఆరో మాస్టర్స్ టైటిల్
- అతడి కెరీర్‌లో ఇది 26వ డబుల్స్ టైటిల్
- లియాండర్ పేస్ తర్వాత ఏటీపీ నిర్వహించే అన్ని (9) మాస్టర్స్ ఈవెంట్స్‌లో ఫైనల్ ఆడిన రెండో భారత ఆటగాడిగా రికార్డ్
మియామి ఓపెన్ టైటిల్ గెలిచి భారత్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న కొత్త ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. పురుషుల డబుల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి అదరగొట్టాడు. ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గిన ఈ ఇండో-ఆసీస్ ద్వయం.. ఇప్పుడు మియామి ఓపెన్‌లోనూ జోరు కొనసాగించింది. పురుషుల డబుల్స్ ఫైనల్‌లో 6-7 (7-3), 6-3, 10-6 తేడాతో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా), ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) పై బోపన్న జోడీ విజయం సాధించింది. ఈ పోరులో బోపన్న ద్వయం తొలి గేమ్‌లో వెనుకబడ్డా తర్వాత పుంజుకుని వరుస గేమ్స్‌లో ప్రత్యర్థిని చిత్తు చేయడం గమనార్హం.
ఇక ఈ విజయం ద్వారా 44 ఏళ్ల వయసులో ‘ఏటీపీ మాస్టర్స్ 1000’ టైటిల్ నెగ్గిన ఆటగాడిగా బోపన్న కొత్త చరిత్ర సృష్టించాడు. పెద్ద వయసులో ఏటీపీ మాస్టర్స్ 1000 ఛాంపియన్‌గా నిలిచిన ఆటగాడిగా తన రికార్డు (గతేడాది ఇండియన్ వెల్స్ టైటిల్) ను బోపన్న మెరుగుపరుచుకున్నాడు. బోపన్నకు ఇది 14వ ఏటీపీ మాస్టర్స్ ఫైనల్ కాగా ఆరో మాస్టర్స్ టైటిల్. మొత్తంగా అతడి కెరీర్‌లో ఇది 26వ డబుల్స్ టైటిల్.
అలాగే ఈ టోర్నీలో బోపన్న ఫైనల్ చేరిన నేపథ్యంలో భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తర్వాత ఏటీపీ నిర్వహించే అన్ని (9) మాస్టర్స్ ఈవెంట్స్‌లో ఫైనల్ ఆడిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఓపెన్ చరిత్రలో అన్ని మేజర్ టోర్నీలలో డబుల్స్ టైటిల్స్ నెగ్గిన మూడో ఇండియన్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. ఇంతకుముందు లియాండర్ పేస్, మహేశ్ భూపతి ఇలా ఏటీపీ టైటిల్స్ సాధించారు. ఇక తాజాగా మియామి టైటిల్ విజయంతో ప్రపంచ నం.01 ఆటగాడిగా కూడా అవతరించాడు.