G. Kishan Reddy: కేటీఆర్‌ను చూసి జాలిపడాలి... ఆయన ముఖ్యమంత్రి ఆశలు అడియాసలయ్యాయి: కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా ముఖ్యమంత్రి అయినట్లుగా ఫీల్ అవుతున్నారని విమర్శ
- తండ్రీ, కొడుకులతోనే తెలంగాణ నాశనమయిందని మండిపాటు
- బీఆర్ఎస్ అత్యంత వేగంగా పతనమవుతోందని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను చూసి జాలిపడాలని... ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్లుగా ఫీల్ అవుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలనుకున్న కేటీఆర్ ఆశలు అడియాసలయ్యాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తండ్రీ, కొడుకులతోనే తెలంగాణ నాశనమయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అత్యంత వేగంగా పతనమవుతోందన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేసీఆర్ సహకరించలేదని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి మాత్రమే కేసీఆర్ వచ్చారని... ఆ తర్వాత ఎప్పుడూ దానిని పట్టించుకోలేదని విమర్శించారు.
పదేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుందన్నారు. అవినీతి లేకుండా మోదీ పాలన సాగిందన్నారు. ప్రపంచానికే సాయంచేసే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు. సంక్షేమం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినట్లు చెప్పారు. దేశంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకుని వచ్చామని, వ్యాపారస్తులకు జీఎస్టీ వరంగా మారిందన్నారు. ప్రతి ఏటా జీఎస్టీ ద్వారా రూ.1.66 లక్షల కోట్లు ఆదాయం దేశానికి వస్తోందన్నారు. దేశవ్యాప్తంగా 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు చెప్పారు.
ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయన్నారు. పన్ను రాయితీని పెంచామన్నారు. హైదరాబాద్ మెట్రోకు రూ.12 వేల కోట్లు ఇచ్చామన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంతో ప్రమాదాలు తగ్గిపోయాయన్నారు. 20 వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌లకు విద్యుద్డీకరణ పూర్తయిందన్నారు. రోడ్ నెట్‌వర్క్‌లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. 101 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించామని... 411 కంపెనీలు దేశంలో సెల్‌ఫోన్ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు మారలేదని విమర్శించారు.