Perni Nani: పింఛనుదారులకు డబ్బులు ఇవ్వకుండా ఆపిందెవరు?: పేర్ని నాని
- పెన్షన్లు, వాలంటీర్ల వ్యవహారంపై పేర్ని నాని ప్రెస్ మీట్
- పెన్షన్లను అడ్డుకునేందుకు చంద్రబాబు తన తాబేదార్లతో ప్రయత్నించారని ఆరోపణ
- చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం అని విమర్శలు
ఏపీలో పెన్షన్లు, వాలంటీర్ల వ్యవహారం తీవ్ర రూపు దాల్చింది. దీనిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. పింఛనుదారులకు డబ్బులు ఇవ్వకుండా ఆపిందెవరు? అని మండిపడ్డారు.
ఏపీలో 66 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారని, 2.50 లక్షల మంది వాలంటీర్ల ద్వారా, మూడ్రోజుల పాటు పెన్షన్లు అందించే కార్యక్రమం జరుగుతుందని, కానీ చంద్రబాబు కారణంగా ఈ కార్యక్రమం ఆగిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు తన తాబేదార్లతో ఢిల్లీ నుంచి మండల స్థాయి వరకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
తాటి చెట్టు, వేప చెట్టులా వందలు, వేల సంవత్సరాలు బతకనక్కర్లేదు... నీ 14 ఏళ్ల హయాంలో ముసలివాళ్లకు, దివ్యాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇద్దామన్న ఆలోచన ఏనాడైనా వచ్చిందా? అంటూ చంద్రబాబును నిలదీశారు. నువ్వొక పెత్తందారీ మనస్తత్వం ఉన్న వాడివి కాబట్టి నీకు అలాంటి ఆలోచనలు రావు... నీకు పేదల పట్ల జాలి ఉండదు, పేదలను ఓటు బ్యాంకుగానే చూస్తావు, పేదలను మనుషులుగానే చూడవు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.
వాలంటీర్లను పక్కనపెట్టండి అని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇవ్వగానే టీడీపీ వాళ్లు తుళ్లింతలు, కేరింతలతో సంబరాలు చేసుకున్నారని వెల్లడించారు. ఇవాళేమో తలుపు సందులో తోక ఇరుక్కున్న కోతిలాగా తన్నుకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబూ... నువ్వే కాదు, నీ తల్లో జేజమ్మ దిగివచ్చినా ఏపీలో పెన్షన్లు ఆపలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.