IMD: ఈ వేసవిలో ఠారెత్తించనున్న ఎండలు.. ఐఎండీ హెచ్చరిక

IMD predicts longer heat waves and high temperatures this year summer

  • అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాల్పుల ముప్పు పొంచివుందన్న భారత వాతావరణ విభాగం
  • రెండున్నర నెలలపాటు ఎండలు దంచికొట్టనున్నాయని హెచ్చరిక
  • లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సంబంధిత భాగస్వాములు అప్రమత్తంగా ఉండాలన్న కేందమంత్రి కిరెన్ రిజిజు
  • ఏపీ సహా పలు రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయన్న ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర

ఈ వేసవిలో ఎండలు ఠారెత్తించనున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయని, వడగాల్పులు వీయనున్నాయని సూచించింది. ఏప్రిల్ చివరన మొదలుకొని సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. రాబోయే రెండున్నర నెలల్లో ఇవే పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన భాగస్వాములందరూ ముందస్తుగా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరెన్ రిజిజు ప్రకటించారు.

ఏప్రిల్‌ నెలలో మధ్య భారతం, దక్షిణ భారత్‌లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ప్రకటించారు. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వొచ్చని పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల్లోని చాలా ఏరియాల్లో సాధారణం కంటే అధిక వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. దేశంలోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజులపాటు వేడిగాలులు వీస్తాయన్నారు.

ఏపీలో తీవ్ర వడగాల్పులు
దేశంలో ప్రాంతాల వారీగా చూస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లలో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మోహాపాత్ర తెలిపారు. ఏప్రిల్‌లో చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కాగా హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశాలలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవ్వొచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News