VV Lakshminarayana: వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి: జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ
- ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనాను కలిసిన లక్ష్మీనారాయణ తదితరులు
- ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వినతి
- వాలంటీర్లను, మెప్మా సిబ్బందిని బదిలీ చేయాలని సీఈవోను కోరామన్న లక్ష్మీనారాయణ
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ నేడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిశారు. ఆయనతో పాటు లిబరేషన్ కాంగ్రెస్ నేతలు కూడా మీనాను కలిశారు. వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని లక్ష్మీనారాయణ తదితరులు సీఈవోను కోరారు.
సీఈవోని కలిసిన అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. వాలంటీర్లు, మెప్మా సిబ్బందిని బదిలీ చేయాలని కోరామని వెల్లడించారు. సస్పెండైన వాలంటీర్లు వైసీపీకి పనిచేస్తున్నారని ఆరోపించారు.
వాలంటీర్లను వారు పనిచేస్తున్న ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకు పంపాలని లక్ష్మీనారాయణ అన్నారు. ఉత్తరాంధ్రలో పనిచేసే వాలంటీర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించినట్టు తెలిపారు. వాలంటీర్లు అదే చోట ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని అభిప్రాయపడ్డారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామని వివరించారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు జరిగేలా చూడాలని కూడా కోరామని లక్ష్మీనారాయణ చెప్పారు.