Mumbai Indians: చచ్చీచెడీ 125 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్... అదీ సొంతగడ్డపై!
- ఐపీఎల్ లో నేడు ముంబయి × రాజస్థాన్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసిన ముంబయి
- 20 రన్స్ కే 4 వికెట్లు డౌన్... ఆదుకున్న తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా
- చెరో మూడు వికెట్లతో విజృంభించిన బౌల్ట్, చహల్
ఐపీఎల్ లో ఇవాళ ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ అతికష్టమ్మీద 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. అది కూడా సొంతగడ్డపై ఈ స్థాయిలో బ్యాటింగ్ వైఫల్యం ముంబయి అభిమానులను నిరాశకు గురిచేసింది.
ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో... ముంబయి ఇండియన్స్ ఆదిలోనే తడబాటుకు గురైంది. రాజస్థాన్ రాయల్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ విజృంభించడంతో ముంబయి 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (0), నమన్ ధీమర్ (0), డివాల్డ్ బ్రెవిస్ (0)... బౌల్ట్ ధాటికి ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ బాటపట్టారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 16 పరుగులు చేసి నాండ్రే బర్గర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
ఈ దశలో తిలక్ వర్మ (32), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (34) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. భారీ షాట్లతో స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అయితే వీళ్లిద్దరినీ చహల్ అవుట్ చేయడంతో ముంబయి కథ మళ్లీ మొదటికి వచ్చింది. టిమ్ డేవిడ్ 17 పరుగులు చేయడంతో, ముంబయి స్కోరు కనీసం 100 పరుగులైనా దాటగలిగింది.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో బౌల్ట్ 3, చహల్ 3, బర్గర్ 2, అవేష్ ఖాన్ 1 వికెట్ తో రాణించారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది. రోవ్ మాన్ పావెల్, హెట్మెయర్ పట్టిన క్యాచ్ లు వావ్ అనిపించాయి.