Raghu Rama Krishna Raju: నాకు ఏ పార్టీ మద్దతు లేదు... మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది: రఘురామ
- రఘురామకు నో టికెట్
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రఘురామ
- ఏ పార్టీలో సభ్యుడ్ని కాకపోవడం వల్లే మద్దతు ఇవ్వడం లేదేమోనని వ్యాఖ్యలు
ఎన్నికల్లో తనకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విచారం వ్యక్తం చేశారు. తాను చేస్తున్నది ఒంటరిపోరాటం అని, న్యాయానికి ఎప్పుడూ బలం ఉంటుందని అన్నారు.
నాకు ఏ పార్టీ మద్దతు లేదు... మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది... ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడ్ని కాను అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో సభ్యుడ్ని కాకపోవడం వల్లే మద్దతు ఇవ్వడంలేదని అంటున్నారని రఘురామ పేర్కొన్నారు. తన పోరాటం రాష్ట్ర ప్రజల కోసం అని, చంద్రబాబు వంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతో, ఉబలాటంతో పోరాటం చేశానని అన్నారు.
"నా గొప్పల కోసం నేను పోరాటం చేయలేదు. ఐదేళ్ల పాటు నా పదవిని హాయిగా అనుభవించవచ్చు... ఎవరైనా పదవి అనుభవించాలనే చూస్తారు. ఇటీవల కొందరు టీడీపీలో చేరారు, కొందరు బీజేపీలో చేరారు. వారు పోరాటాలు చేయడం తర్వాత... వారిలో ఎవరైనా, ఏనాడైనా పెదవి విప్పి ఒక్క మాట అడిగిన వాళ్లు ఉన్నారా? అలాంటి ఒక్కరిని చూపించినా నేను ఇక ఈ కూటమిని సీటు అడగను. ఈ పది రోజుల్లో ఆయా పార్టీల్లో చేరిన వారిలో ఏ ఒక్కరైనా... మూడు నెలల ముందు జగన్ ను ఈ విధంగా ప్రశ్నించారు అని చెబితే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటాను.
బీజేపీ కావొచ్చు, జనసేన కావొచ్చు, టీడీపీ కావొచ్చు... ఈ కూటమిలో ఎంతోమందికి సీట్లు ఇచ్చారు. నేను చేసిన పోరాటమే నాకు శాపంగా మారిందా? నేను రాజకీయ స్వార్థం లేని వాడ్ని. స్వార్థపరుడ్నే అయివుంటే నేను కూడా పార్టీ పెట్టేవాడ్నేమో. శ్రామికుడు అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మనసా వాచా కర్మణా కోరుకున్నాను" అని రఘురామ వివరించారు.