MI vs RR: ముంబై ఇండియన్స్‌కి వరుసగా మూడవ ఓటమి
- తిరుగులేని ప్రదర్శనతో వరుసగా 3వ విజయాన్ని దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్
- బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్ అద్భుత ప్రదర్శన
- మరోసారి ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్‌పై వరుసగా మూడవ విజయాన్ని సంజూ శాంసన్ సేన నమోదు చేసింది. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్ రాణించడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ముంబై నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడవ ఓటమిని చవిచూసింది.
కాగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లను రాజస్థాన్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ అల్లాడించారు. అద్భుతంగా బౌలింగ్ చేసి వరుసగా విరామాల్లో వికెట్లు తీశారు. ముఖ్యంగా బౌల్ట్ ముంబై ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి ముంబైని కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌లో 5వ బంతికి రోహిత్ శర్మను, 6వ బంతికి నమన్ ధీర్‌ను ఔట్ చేశాడు. బౌల్ట్ వేసిన రెండో ఓవర్‌లో డేవాల్డ్ బ్రేవిస్‌ను కూడా ఔట్ చేశాడు. దీంతో 20/4 స్కోరుతో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. మిగతా బ్యాటర్లు కూడా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్ధిక్ పాండ్యా 34, తిలక్ వర్మ 32 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ చెరో 3 వికెట్లు, బర్గర్ 2 వికెట్లు, అవేశ్ ఖాన్ 1 చొప్పున వికెట్లు తీశారు.
మరోవైపు 125 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులకు గురయ్యింది. మొదటి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. జాస్ బట్లర్ (13), సంజూ శాంసన్ (12) కూడా స్వల్ప స్కోర్లకే ఔటవ్వడంతో రాజస్థాన్ శిబిరంలో చిన్నపాటి టెన్షన్ కనిపించింది. అయితే యువ బ్యాటర్ రియాన్ పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 54 పరుగులతో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. ఇతర బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ 16, శుభమ్ దూబే 8 (నాటౌట్) చొప్పున వికెట్లు తీశారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన ట్రెంట్ బౌల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.