Cruise ship Tour: గర్భిణీ సహా 8 మందిని సముద్రం మధ్యలో దీవిలోనే వదిలేసి వచ్చిన షిప్.. ఎందుకంటే..!
- లేట్ గా వచ్చారని షిప్ లోకి రానివ్వని కెప్టెన్
- ఆఫ్రికాలోని ఓ టూరిజం కంపెనీ నిర్వాకం
- దీవిలోనే చిక్కుకుపోయిన పర్యాటకులు
దీవిలో తిరుగుతూ ఆలస్యంగా తిరిగొచ్చారని ఓ షిప్ కెప్టెన్ టూరిస్టులను సముద్రం మధ్యలో ఉన్న ఆ దీవిలోనే వదిలేసి వెళ్లిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. సదరు పర్యాటకులు తీరానికి చేరుకున్నపుడు షిప్ ఇంకా అక్కడే ఉన్నా సరే.. వాళ్లను లోపలికి అనుమతించకుండా బయలుదేరడంతో నార్వేజియన్ క్రూయిజ్ షిప్ నిర్వాహకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీవిలోనే వదిలేసిన పర్యాటకులలో ఓ గర్భిణీతో పాటు హృద్రోగ బాధితుడైన ఓ వృద్ధుడు సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు.
అమెరికాకు చెందిన నలుగురితో పాటు వివిధ దేశాలకు చెందిన టూరిస్టులతో నార్వేజియన్ క్రూయిజ్ షిప్ ఒకటి ఆఫ్రికన్ ఐలాండ్ టూర్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ షిప్ మార్చి 27న సావో టోమ్ అనే దీవికి చేరుకుంది. దీవిని సందర్శించి నిర్ణీత సమయంలోగా షిప్ ను చేరుకోవాలంటూ ప్రయాణికులకు కెప్టెన్ సూచనలు చేశాడు. తీరానికి సమీపంలో లంగరు వేసిన షిప్ లో నుంచి చిన్న చిన్న బోట్ లలో పర్యాటకులు దీవిపైకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది పర్యాటకుల గ్రూపు ఒకటి తిరిగి షిప్ ను చేరుకోవడంలో ఆలస్యమైంది. అప్పటికి షిప్ బయలుదేరకున్నా కూడా ఆ పర్యాటకులను షిప్ లోకి ఎక్కేందుకు కెప్టెన్ అనుమతించలేదు.
చెప్పిన సమయంలోగా రాలేదని పేర్కొంటూ వారిని అక్కడే వదిలేసి వెళ్లాడు. షిప్ లో ఉన్న వారి బ్యాగులు, పర్స్ లు ఇతర సామాన్లను తీసుకోవడానికి కూడా అనుమతించలేదు. దీంతో కోస్ట్ గార్డ్ సాయంతో తీరం చేరుకున్న పర్యాటకులు.. తిరిగి తమ షిప్ ను చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆ షిప్ సెనెగల్ చేరుకుంటుంది. ఈ ఘటనపై పర్యాటకులు తీవ్రంగా మండిపడుతున్నారు. టూర్ కు తీసుకెళ్లిన పర్యాటకులను అలా సముద్రం మధ్యలో వదిలేయడమేంటని ప్రశ్నస్తున్నారు. వారు తిరిగొచ్చిన సమయానికి షిప్ ఇంకా బయలుదేరకపోయినా కూడా లోపలికి అనుమతించకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు.