katchatheevu island: ఏమిటీ ‘కచ్ఛతీవు దీవి’ వివాదం?
ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న పేచీ
భారత జాలర్లను అరెస్టు చేస్తున్న శ్రీలంక
దీవిపై సార్వభౌమాధికారం వదులుకోలేదంటున్నకేంద్రం
ఏమిటీ కచ్ఛతీవు దీవి వివాదం?
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చిన కచ్చతీవు దీవి అంశం బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే పార్టీల రాజకీయ వివాదానికి తెరలేపింది. 1974లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ దీవిని శ్రీలంకకు అప్పనంగా అప్పగించారని, ఈ దీవికి ఉన్న ప్రాధాన్యత గురించి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదని, డీఎంకే సైతం దీనిపై రెండు నాల్కల ధోరణి అవలంబించిందంటూ మోదీ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించడంతో ఈ అంశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఈ దీవి ఎక్కడుంది? ఎందుకు ఇది వివాదానికి కారణమైందో తెలుసుకోవాలంటే ఓసారి చరిత్రలోకి తొంగిచూడాల్సిందే..
రామేశ్వరానికి సమీపంలో...
తమిళనాడులోని రామేశ్వరానికి వాయవ్యంగా 33 కిలోమీటర్ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు నైరుతి దిశగా 62 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో కచ్ఛతీవు దీవి ఉంది. అయితే ఈ దీవిలో మంచినీటి వనరులేవీ లేకపోవడంతో ఇది నివాసయోగ్యం కాదు. 14వ శతాబ్దంలో అగ్నిపర్వత విస్ఫోటనం తర్వాత ఈ దీవి ఏర్పడింది. తొలినాళ్లలో ఈ దీవిని జాఫ్నా రాజ్యం నియంత్రించేది. 17వ శతాబ్దంలో రామేశ్వరానికి చెందిన రామ్నాథ్ జమీందారీ దీనిపై అజమాయిషీ పొందింది. స్వాతంత్రానికి ముందు భారత్, శ్రీలంకలు బ్రిటిష్ కాలనీలుగా కొనసాగడంతో ఈ దీవి బ్రిటిష్ పాలకుల పరిధిలోని మద్రాస్ ప్రెసిడెన్సీ అధీనంలో ఉండేది. అయితే 1921లో ఇరు దేశాలు చేపల వేట సరిహద్దుల కోసం ఈ దీవి తమకే చెందుతుందని ప్రకటించుకున్నాయి. తమ సర్వే ప్రకారం ఈ దీవి తమ పరిధిలోకే వస్తుందని శ్రీలంక వాదించగా భారత్లోని బ్రిటిష్ బృందం దీన్ని తోసిపుచ్చింది. ఇది రామ్నాథ్ జమీందారులకే చెందుతుందని స్పష్టం చేసింది.
1974లో ఇందిర చొరవ...
ఈ దీవి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో 1974లో నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ లంకతో రాజీకి సిద్ధపడ్డారు. ఇండో శ్రీలంకన్ మారిటైం అగ్రిమెంట్ పేరుతో కచ్ఛతీవు దీవిపై హక్కును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. తద్వారా లంకతో మెరుగైన స్నేహ సంబంధాలు సాధించవచ్చని భావించారు. ఈ దీవికి వ్యూహాత్మకంగా పెద్ద ప్రాధాన్యత లేదని అనుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత జాలర్లు ఈ దీవి పరిధిలోని సముద్ర జలాల్లోనూ చేపల వేట సాగించొచ్చు. కానీ లంక ప్రభుత్వం ఈ నిబంధనను పట్టించుకోలేదు. భారత జాలర్లు కేవలం విశ్రాంతి తీసుకొనేందుకే ఈ దీవికి రావొచ్చని, ఈ దీవిలో ఉన్న క్యాథలిక్ చర్చి సందర్శనకు వీసా లేకుండానే రావడం వరకే పరిమితం చేస్తామని పేర్కొంది. తమ దీవి పరిధిలో చేపల వేటను అంగీకరించబోమని వాదించింది.
లంక ధిక్కారం...
అయితే 1983 నుంచి 2009 మధ్య శ్రీలంకలో తమిళులు, సింహళీయుల మధ్య జరిగిన అంతర్యుద్ధం కారణంగా ఈ దీవి అంశం మరుగున పడిపోయింది. 2009లో ఎప్పుడైతే ఎల్టీటీఈతో యుద్ధం ముగిసిందో నాటి నుంచి ఈ ప్రాంతం వద్ద నౌకాదళాన్ని లంక మోహరించింది. నాటి నుంచి ఈ దీవి వద్దకు వచ్చే భారత జాలర్లను అరెస్టు చేస్తూ వస్తోంది. దీంతో ఈ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు తమిళనాడు ప్రజల నుంచి వస్తున్నాయి. 2011లో నాటి తమిళనాడు సీఎం జయలలిత ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ దీవిని లంకకు అప్పగించడం చెల్లదని వాదించారు. 2006లో నాటి డీఎంకే అధినేత కరుణానిధి ఈ అంశంపై నాటి ప్రధాని మన్మోహన్కు లేఖ రాశారు. 2023లో తమిళనాడు ప్రస్తుత సీఎం, కరుణానిధి కుమారుడు స్టాలిన్ సైతం ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. భారత పర్యటనకు వస్తున్న లంక ప్రధాని విక్రమసింఘేతో ఈ అంశాన్ని చర్చించాలని కోరారు. అయితే కేంద్రం వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఈ దీవిపై వివాదం కొనసాగుతోందని... భారత భూభాగాన్ని లేదా దానిపై సార్వభౌమాధికారాన్ని ఎక్కడా తాము వదులుకోలేదని చెబుతోంది.