Kadiam Srihari: బీఆర్ఎస్ నేతల చిట్టాలన్నీ నా దగ్గరున్నాయి.. బయట పెడితే తట్టుకోలేరు: కడియం శ్రీహరి

Kadiam Srihari Strong worning to errabelli and palla rajeswar rao

  • ఇటీవలే కూతురుతో కలిసి కాంగ్రెస్ లో చేరిన కడియం
  • తనపై విమర్శలు చేస్తున్న వారి చరిత్ర తనకు తెలుసని హెచ్చరిక 
  • కేసీఆర్ పై తనకు గౌరవం ఉందని, ఆయనపై విమర్శలు చేయబోనని వ్యాఖ్య 

బీఆర్‌ఎస్‌ నేతలందరి చిట్టాలు తన వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడితే తట్టుకోలేరని కడియం శ్రీహరి వార్నింగ్‌ ఇచ్చారు. తాను పార్టీ మారడంపై విమర్శలు చేస్తున్న వారి చరిత్ర తనకు తెలుసన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ను వీడటం బాధగానే ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరక తప్పలేదని వివరించారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై తనకు గౌరవం ఉందని, ప్రత్యేకంగా ఆయనపై ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదని అన్నారు.
 
నాపై మాత్రమే విమర్శలు ఎందుకు?

ఎంతోమంది నేతలు పార్టీ మారుతున్నా ఎవరిపైనా స్పందించని బీఆర్ఎస్ నేతలు తనను మాత్రం ఎందుకు టార్గెట్ చేసినట్లు మాట్లాడుతున్నారని అడిగారు. తన విషయంలో వారు మాట్లాడే పద్ధతి బాగోలేదన్నారు. జిల్లా స్థాయి నేతలు కూడా తనపై అనవసర కామెంట్స్‌ చేయడాన్ని కడియం ప్రస్తావించారు.
 
ఎర్రబెల్లి, పల్లా, రసమయిలపై ఫైర్

పాలకుర్తి ప్రజలు చీకొట్టినా ఎర్రబెల్లి దయాకర్ కు బుద్ధి రాలేదని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని కడియం ఎద్దేవా చేశారు. అహంకారపు మాటలు తగ్గించుకుంటే ఆయనకే మంచిదని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ కు ఇలాంటి దుస్థితి రావడానికి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వంటి నేతలే కారణమని కడియం ఆరోపించారు. తనపై ఆయన చేసినవన్నీ అసత్య ఆరోపణలేనని కొట్టిపారేశారు. పల్లా ఆరోపణలకు ఆధారాలు చూపించకుంటే ఆయనను జనగామలో బట్టలు ఊడదీసి నిలబెడతానని కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్‌కు కూడా కడియం వార్నింగ్‌ ఇచ్చారు. మానుకొండూరు ప్రజలు చిత్తుగా ఓడించినా బుద్ధి లేకుండా అనవసర మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
 
బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్ కే సాధ్యం

బీజేపీని అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. సీబీఐ, ఈడీలను ప్రయోగించి విపక్షాల నేతలను లొంగదీసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీలో చేరితే ఎలాంటి నేతలైనా సరే పునీతులు అవుతారని, అదే కాంగ్రెస్ లో చేరితే అవినీతిపరులు అవుతారని అన్నట్లు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని నాలుగు వందల సీట్లలో గెలిపిస్తే వారు రాజ్యాంగాన్నే మార్చేస్తారని కడియం ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను ఎత్తేసే ప్రమాదం కూడా ఉందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు. అందుకే తాను, తన కూతురు కడియం కావ్యతో కలిసి కాంగ్రెస్ లో చేరినట్లు వివరించారు. తనను గెలిపించిన విధంగానే ఈ ఎన్నికల్లో కావ్యను కూడా గెలిపించాలని కడియం శ్రీహరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News