Nara Lokesh: మంగళగిరిలో భవన నిర్మాణ కార్మికులతో నారా లోకేశ్ భేటీ
- జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్న లోకేశ్
- 30 లక్షల మంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన
- తాము అధికారంలోకి వచ్చాక ఇసుక రేటు తగ్గిస్తామని హామీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లోకేశ్... ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నారు.
ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ అయ్యారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్నారు. జగన్ ధనదాహంతో ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో, రాష్ట్రంలోని 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో ట్రాక్టర్ ఇసుక రూ.1,500 ఉంటే, జగన్ రెడ్డి పాలనలో రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ధర పలుకుతోందని ఆరోపించారు.
"ఈ భేటీలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇసుక అందుబాటులో లేకుండా పోవడంతో పనులు లేవని వెల్లడించారు. అమరావతి నిర్మాణం నిలిచిపోవడంతో తామంతా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వెలిబుచ్చారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇసుక రేటు తగ్గించి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని భరోసా ఇచ్చాను" అని నారా లోకేశ్ వివరించారు.