IPL 2024: ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ డెలివ‌రీ.. రెండు రోజుల‌కే ప‌రిమిత‌మైన‌ మ‌యాంక్ యాద‌వ్ రికార్డు!

Mayank Yadav record lasts 2 days as Gerald Coetzee clocks fastest ball of IPL 2024

  • గంటకు 157.4 కిలోమీటర్ల వేగంతో బంతి వేసిన ఎంఐ బౌల‌ర్‌ గెరాల్డ్ కోయెట్జీ
  • రాజ‌స్థాన్ రాయల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన కోయెట్జీ 
  • అరంగేట్ర మ్యాచ్‌లోనే గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతి వేసిన మయాంక్ యాదవ్
  • రెండు రోజుల్లోనే మ‌యాంక్ రికార్డును బ్రేక్ చేసిన గెరాల్డ్ కోయెట్జీ 
  • ఇప్ప‌టికీ షాన్ టైట్ పేరిటే ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత వేగ‌వంత‌మైన డెలివ‌రీ (157.71 కిలోమీట‌ర్ల) రికార్డు

సోమ‌వారం ముంబై వాంఖ‌డే స్టేడియంలో రాజ‌స్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌) తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) మీడియం పేస‌ర్ గెరాల్డ్ కోయెట్జీ గంటకు 157.4 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి ఆశ్చ‌ర్యప‌రిచాడు. ఇది ఐపీఎల్ 2024లో అత్యంత వేగ‌వంత‌మైన డెలివ‌రీగా రికార్డుల‌కెక్కింది. అయితే, రెండు రోజుల ముందు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్ ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఫాస్టెస్ట్ బాల్‌ (గంటకు 155.8 కిలోమీటర్లు) విసిరి రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ రికార్డును కోయెట్జీ అధిగ‌మించాడు. దీంతో మయాంక్ యాద‌వ్ రికార్డు రెండు రోజుల‌కే ప‌రిమిత‌మైన‌ట్ల‌యింది.    

కాగా, అరంగేట్ర మ్యాచ్‌లోనే గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి భార‌త న‌యా సంచ‌ల‌నం మయాంక్ యాద‌వ్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. గ‌త శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్‌పై మ్యాచ్‌లో గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయ‌డం మాములు విష‌యం కాదు. ఇక ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన మయాంక్ కేవలం 27 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీశాడు. 

ఇదిలాఉంటే.. ఐపీఎల్ చ‌రిత్రలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన రికార్డు మాత్రం ఆస్ట్రేలియ‌న్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షాన్ టైట్ పేరిట ఉంది. 2011 ఐపీఎల్ సీజ‌న్‌లో షాన్ టైట్ ఏకంగా గంట‌కు 157.71 కిలోమీట‌ర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. చిన్నపాటి వ్య‌త్యాసంతో 13 ఏళ్ల ఈ రికార్డును గెరాల్డ్ కోయెట్జీ (గంటకు 157.40 కిలోమీటర్లు) అధిగ‌మించ‌లేపోయాడు.

  • Loading...

More Telugu News