Mumbai Indians: ముంబయి ఇండియన్స్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత హార్దిక్ పాండ్యా ట్వీట్

Hardik Pandya tweets on MI loses

  • ఐపీఎల్ తాజా సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిన ముంబయి
  • గత రాత్రి సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్ చేతిలో భంగపాటు
  • ఓటమికి తలవంచం అంటూ హార్దిక్ పాండ్యా స్పందన 

గుజరాత్ టైటాన్స్ కు తొలి సీజన్ లోనే కప్పు తెచ్చి పెట్టి, రెండో సీజన్ లోనూ ఫైనల్ వరకు జట్టును తీసుకొచ్చిన హార్దిక్ పాండ్యా... ఈసారి తమ జట్టును విజయపథంలో నడిపిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ, అతడ్ని కెప్టెన్ గా తెచ్చుకుంది. కానీ, ఐపీఎల్ తాజా సీజన్ లో మూడు మ్యాచ్ లు ఆడాక ఆ నిర్ణయం ఎలా బెడిసికొట్టిందో ముంబయి జట్టు యాజమాన్యానికి బాగా అర్థమైంది. 

టోర్నీలో ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్ ల్లో ముంబయి ఇండియన్స్ ఓటమిపాలైంది. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఓటముల హ్యాట్రిక్ నమోదు చేసింది. అది కూడా సొంతగడ్డపై దారుణ రీతిలో ఓడిపోవడం ముంబయి ఇండియన్స్ యాజమాన్యానికి, అభిమానులకు ఏమాత్రం మింగుడుపడడంలేదు. ఈ నేపథ్యంలో, ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎక్స్ లో స్పందించాడు. 

"ఈ జట్టు గురించి మీరొక విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే వినండి! మేం ఓటమికి తలవంచం... మేం పోరాడుతూనే ఉంటాం, ముందుకు వెళుతూనే ఉంటాం" అని ట్వీట్ చేశాడు. 

ముంబయి ఇండియన్స్ కు ఐపీఎల్ లో 5 టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించి, హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా చేయడం విమర్శలపాలైంది. జట్టులోనే చాలామందికి హార్దిక్ కెప్టెన్ కావడం ఇష్టం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు అంతా ఏకతాటిపై ఉందన్న సందేశం ఇచ్చేందుకే హార్దిక్ ఈ ట్వీట్ చేసి ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News