Komatireddy Venkat Reddy: భువనగిరి, నల్గొండలలో కచ్చితంగా గెలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించడమే తమ బాధ్యత అన్న కోమటిరెడ్డి
- బీఆర్ఎస్‌ది కుటుంబ పాలన అని విమర్శ
- కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేకున్నా ఈసారి గెలిచామన్న కోమటిరెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి, నల్గొండలలో కచ్చితంగా గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తుక్కుగూడలో ఈ నెల 6న బహిరంగసభకు కాంగ్రెస్ సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... తుక్కుగూడలో 10 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్‌ను గెలిపించడమే తమ బాధ్యత అన్నారు. 8న నాంపల్లిలో ఫిరోజ్‌ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి సమావేశం ఉంటుందన్నారు. భువనగిరి, నల్గొండతో పాటు సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌ది కుటుంబ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేకున్నా ఈసారి గెలిచామన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా సికింద్రాబాద్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయన మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నారన్నారు. కానీ అది అసాధ్యమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 40 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టును ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అని అంటున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు మాటలకు అర్థం లేదన్నారు. కేసీఆర్ చేసిన పాపాల కారణంగానే వర్షాలు కురవడం లేదన్నారు.