Virendra Sehwag: నా చివరి శ్వాస వరకు 'ఆ రోజు' నాతోనే ఉంటుంది.. 2011 ప్రపంచకప్ విక్టరీపై సెహ్వాగ్ ట్వీట్!
- వన్డే ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అయిన సందర్భంగా 'ఎక్స్' వేదికగా స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్
- వరల్డ్‌కప్ గెలిచిన ఆ క్షణాలను తన జీవితకాలంలో ఎప్పటికీ మరిచిపోలేనన్న భారత మాజీ క్రికెటర్
- కోట్లాది మంది భారతీయుల కల నెరవేరిన దినంగా అభివర్ణించిన డాషింగ్ ఓపెనర్
2011, ఏప్రిల్ 2వ తేదీని భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. సరిగ్గా ఇదే రోజున 13 ఏళ్ల క్రితం భారత క్రికెట్ జట్టు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. 1983 తర్వాత 28 ఏళ్లకు టీమిండియా రెండో వరల్డ్‌కప్ గెలిచింది. ఇవాళ్టితో ఈ అద్భుతమైన ఘట్టానికి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత మాజీ క్రికెటర్, ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యుడు వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా 'ఎక్స్' (ట్విటర్) వేదికగా స్పందించారు.
"కోట్లాది మంది భారతీయుల కల. నా చివరి శ్వాస వరకు నాతోనే ఉండే ఆ రోజు. నా జీవితకాలంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక రోజుకు నేటికి 13 ఏళ్లు" అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇక సెహ్వాగ్ కంటే ముందే సచిన్ టెండూల్కర్ కూడా ఇదే విషయమై ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.