VH: ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద వ్యక్తులు ఎవరో తేలాలి: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు
- ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని విమర్శ
- విచారణను వేగవంతం చేసి అసలు దోషులను బయటకు తీసుకురావాలన్న వీహెచ్
- నయీం అక్రమ ఆస్తులు ఏమయ్యాయో కూడా విచారణ చేపట్టాలన్న కాంగ్రెస్ నేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా చాలామంది బయటకు రావాల్సి ఉందని, ఈ వ్యవహారంలో ఉన్న పెద్ద వ్యక్తులు ఎవరో తేలాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొంతమంది దొరికారని... విచారణ కొనసాగుతోందన్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని విమర్శించారు. అందుకే సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంలో విచారణను వేగవంతం చేయాలని సూచించారు. అసలు దోషులు బయటకు రావాలన్నారు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి తనకు టిక్కెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తానని వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. తాను రాజీవ్ గాంధీతో కలిసి తిరిగానని గుర్తు చేసుకున్నారు. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానన్నారు.
నయీం ఎన్‌కౌంటర్ అయ్యాక అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏమయ్యాయని వీహెచ్ ప్రశ్నించారు. నయీం లాక్కున్న పేదల భూములు ఏమయ్యాయి? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంత సీరియస్‌గా దృష్టి సారించారో నయీం ఆస్తులు, డబ్బుల విషయంలోనూ అలాగే విచారణ చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై దృష్టి సారించాలని కోరారు. ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టి సారిస్తే పేదల దగ్గర లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయవచ్చునన్నారు.