Mayank Yadav: ఐపీఎల్: లక్నోపై టాస్ గెలిచిన ఆర్సీబీ... అందరి దృష్టి అతడి పైనే!
- ఐపీఎల్ లో ఇవాళ బెంగళూరు వర్సెస్ లక్నో
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
- బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
- ప్రధాన ఆకర్షణగా సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్
ఐపీఎల్ లో ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
కాగా, ఈ మ్యాచ్ లో అందరి దృష్టి ఒక యువ ఆటగాడిపై ఉంటుందనడంలో అతిశయోక్తి కాదు. గత మ్యాచ్ లో లక్నో జట్టును ఓటమి కోరల్లోంచి బయటికి లాగి, గెలుపు బాట పట్టించిన యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ నేటి మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు.
పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించడం ఖాయమని అందరూ భావిస్తే, ఎలాంటి అంచనాలు లేకుండా బంతిని అందుకున్న మయాంక్ యాదవ్, గంటకు 150 కి.మీ పైగా వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. ఆ మ్యాచ్ లో అతడు విసిరిన ఓ బంతి గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. పంజాబ్ పై 3 వికెట్లు తీసిన మయాంక్ లక్నో విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఒక్క మ్యాచ్ తో ఈ స్పీడ్ స్టర్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి నేటి మ్యాచ్ లో ఎలా బౌలింగ్ చేస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే, ఇవాళ ఆడుతున్న బెంగళూరు టీమ్ తో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరాన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ వంటి హేమాహేమీ బ్యాట్స్ మెన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో... మయాంక్ యాదవ్ బుల్లెట్ బంతులకు, ఆర్సీబీ బ్యాటర్లకు మధ్య రక్తి కట్టించే పోరు ఖాయమని తెలుస్తోంది.